కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న ప్రధాని

సైనికులతో కలసి దీపావళి జరుపుకున్న మోడీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దర్శించుకున్నారు. ఈ ఏడాది మేలో ఆలయ ద్వారాలు తెరవగా.. శనివారం మూసివేయనున్నారు. ఆలయ మూసివేతకు ఒకరోజు ముందుగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జలీగ్రాంట్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లారు. ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 2013లో సంభవించిన జలప్రళయంలో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధి పునర్‌నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేపట్టారు. సీజన్‌లో ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. మే 3న ఆలయ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.మరోసారి ఆలయాన్ని దర్శించుకున్నారు.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో అక్కడకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో ఈ ఆలయాన్ని ఏటా ఆరు నెలల పాటు మూసి ఉంచుతారు. కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రం వద్ద పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ఆయన.. ఇలాపరమ శివుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గురువారం దీపావళి సందర్భంగా సైనికులతో వేడుకలు జరుపుకున్న ప్రధాని.. శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌ చేరుకున్నారు. జాలీగ్రంట్‌ విమానాశ్రయంలో ఆయనకు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, గవర్నర్‌ కేకే పాల్‌ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాదాపు నాలుగు వేలమంది ప్రజలు కేదార్‌నాథ్‌ ఆలయ ప్రాంగణానికి వచ్చారు. ఆది గురువు శంకరాచార్యుడి సమాధి పునరుద్ధరణ పనులతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 2013లో ముంచెత్తిన భారీ వరదల్లో శంకరాచార్యుడి సమాధి పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీన్ని పునర్నిర్మించడంతో పాటు కేదార్‌నాథ్‌ ఆలయం చుట్టూ పూర్తి భద్రత కోసం గోడను నిర్మించనున్నారు. కాగా ఈ ఒక్క ఏడాదిలోనే మోదీ రెండు సార్లు కేదార్‌నాథుడిని దర్శించుకోవడం విశేషం. శీతాకాల విరామం తర్వాత ఆలయాన్ని తెరిచినప్పుడు ఇక్కడికి వెళ్లిన ఆయన.. మళ్లీ ఆలయాన్ని మూసివేసే ఒక్క రోజు ముందు ఇక్కడికి వెళ్లి పూజలు నిర్వహించారు.

ఆనాడు సాయం తిరస్కరించారు

చార్‌ధామ్‌లో ఒకటైన కేదార్‌నాథ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. 2013లో ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చిన సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తాను సాయం చేస్తానని చెప్పినా.. ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అవసరం లేదంటూ తిరస్కరించిందని వెల్లడించారు. కాంగ్రెస్‌ అభద్రతాభావమే దీనికి కారణమని మోదీ అన్నారు. భారత్‌ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, 2022లో 75వ స్వాతంత్య దినోత్సవం జరుపుకొనే సమయం వరకు తన లక్ష్యాలను సాధిస్తానని స్పష్టంచేశారు. నాలుగేళ్ల కిందట వరదలు వచ్చిన సమయంలో తాను ఇక్కడికి వచ్చానని, బాధితులకు సాయం చేస్తానని చెప్పినా.. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని మోదీ అన్నారు. అందుకే ఇప్పుడు ఉత్తరాఖండ్‌ ప్రజలు కాంగ్రెస్‌ను కాదని బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు.

సైనికుల సమక్షంలో దీపావళి వేడుకలు

జమ్ముకశ్మీర్‌లోని గురెజ్‌ సెక్టార్‌లో జవాన్లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మోదీ జవాన్లందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి వారికి స్వయంగా మిఠాయిలు తినిపించారు. ‘దీపావళి వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకోవాలని అనుకున్నాను. అందుకే విూ దగ్గరికి వచ్చాను. విూరే నా కుటుంబం’ అని మోదీ పేర్కొన్నారు.సైనికులతో సమయాన్ని గడిపితే తనతో కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన అన్నారు. రెండు గంటల పాటు సైనికులతో మోదీ గడిపారు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుంటూ ఎంతో సహనంగా విధులు నిర్వర్తిస్తున్నందుకు జవాన్లను ఆయన అభినందించారు. దేశం కోసం జవాన్లు ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని కొనియా డారు. సైనిక సిబ్బంది సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోం దని ఈ సందర్భంగా మోదీ తెలియజేశారు. మాజీ సైనికుల కోసం ప్రవేశపెట్టిన ఒకే ర్యాంకు ఒకే పింఛను విధానం గురించి మోదీ ప్రస్తావించారు. ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందిన సైనికులు యోగా శిక్షకులుగా మారి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ‘మాతృదేశాన్ని కాపాడేం దుకు.. తమ ప్రియమైన వ్యక్తులకు దూరంగా ఉంటూ, సంప్రదాయాలను త్యాగం చేస్తూ దేశ సరిహద్దులో నిరంతరం పహారా కాస్తున్న సైనికులారా.. విూరు ధైర్యానికి, అంకితభావానికి చిహ్నాలు. అటువంటి విూతో దీపావళి

వేడుకలు జరుపుకునే అవకాశం నాకు దక్కింది. విూరు కోట్లాదిమంది భారతీయులకు సరికొత్త శక్తిని ఇస్తున్నారు’ అంటూ మోదీ అక్కడి విజిటర్స్‌ బుక్‌లో సైనికులనుద్దేశించి రాశారు. ప్రధాని మోదీ వెంట ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఇతర సైన్యాధికారులు పాల్గొన్నారు. వరుసగా నాలుగో ఏడాది మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. 2014లో సియాచిన్‌, 2015లో అమృత్‌సర్‌.. 2016లో ఉత్తరాఖండ్‌ లోని ఐటీబీపీ జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు.