కేబినెట్ కీలక నిర్ణయాలు
– దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్
– తెలుగు చలన చిత్ర పరిశ్రమాభివృద్ధికి నూతన కమిటీ
హైదరాబాద్,ఫిబ్రవరి 7(జనంసాక్షి):సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విూడియాతో మాట్లాడుతూ.. దుమ్మగూడెం ప్రాజెక్టు రీడిజైన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా రీ డిజైన్ ఉంటుందన్నారు. పాల రైతులకు ప్రోత్సాహకాలపై మంత్రి పోచారం అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన సబ్ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వేగవంతం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇక హార్టీకల్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హార్టీకల్చర్ విభాగంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపడుతామని తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జీరో బేస్డ్ బడ్జెట్ పై రాష్ట్ర మంత్రివర్గం చర్చించిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఉజ్జాయింపు లెక్కలు కాకుండా ప్రతి శాఖకు నిర్ధిష్టంగా కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో అన్ని శాఖలు ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాలని, ఈ లోగా సీఎం కేసీఆర్ రోజుకు రెండు మూడు శాఖల ప్రతిపాదనలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో చర్చిస్తారని హరీష్ రావు వివరించారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హరీష్ రావు చెప్పారు. దానికి శ్రీరామ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని నిర్ణయించామన్నారు. సుమారు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నుంచి 50 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటామన్నారు. జిల్లాలోని ఐదు లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విజయ డెయిరీ పాల రైతులకు ఇస్తున్నట్టే రాష్ట్రంలోని పాడి రైతులందరికి లీటరుకు నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే విషయం మంత్రివర్గంలో చర్చించినట్టు హరీష్ రావు వెల్లడించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈటెల రాజెందర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టు హరీష్ రావు తెలిపారు. మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని హరీష్ రావు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకొని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించిందన్నారు. హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని హరీష్ రావు ప్రకటించారు.