కేరళకు గూగుల్‌ విరాళం

– రూ. 7కోట్లు ఆర్థిక సాయం అందజేత

న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులను ఆదుకునేందుకు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ ముందుకొచ్చింది. కేరళలో సహాయకచర్యల నిమిత్తం 1 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 7కోట్లు) ఆర్థిక సాయం చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.’కేరళలో సహాయక చర్యల కోసం గూగుల్‌. ఆర్గ్‌, గూగుల్‌ సిబ్బంది కలిపి 1 మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నాం అని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఆగ్నేయ ఆసియా, ఇండియా) రాజన్‌ ఆనందన్‌ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. గూగుల్‌ కంటే ముందు యాపిల్‌ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది.అటు ఇండియన్‌ బ్యాంకు కూడా కేరళ సీఎం సహాయనిధికి రూ. 4కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ. 3కోట్లను ఇండియన్‌ బ్యాంకు ఉద్యోగులు ఇవ్వగా.. బ్యాంకు రూ. కోటి కలిపి మొత్తం డబ్బును సీఎం సహాయనిధికి అందించినట్లు తెలిపింది. ఇటీవల భారీ వర్షాలతో కేరళలో జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేకపోతున్నారు.

——————————