కేరళలో బన్నీకి ఘనస్వాగతం
కొచ్చి,నవంబర్10(జనంసాక్షి): కథానాయకుడు అల్లు అర్జున్‌కు కేరళ ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం కేరళలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ పోటీలు నిర్వహిస్తున్నారు. అలప్పుజ ప్రాంతంలోని పున్నమ్‌ద సరస్సులో జరగనున్న ఈ పోటీలకు అర్జున్ అతిథిగా హాజరు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో శనివారం స్టైలిష్‌స్టార్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి కొచ్చి చేరుకున్నారు. బన్నీని పలకరించడానికి, చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు తరలివచ్చారు. వారికి బన్నీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు సోషల్‌విూడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘కేరళలో అల్లు అర్జున్‌కున్న క్రేజ్’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
బన్నీకి మాలీవుడ్‌లోనూ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల్ని డబ్ చేసి కేరళలో విడుదల చేస్తుంటారు. డబ్బింగ్ వర్షెన్ అయినా సినిమాలు విశేషమైన వసూళ్లను రాబడుతుంటాయి. అక్కడి ప్రేక్షకులు బన్నీని ‘మ’ల్లు అర్జున్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇటీవల కేరళను వరదలు అతలాకుతలం చేసినప్పుడు అల్లు అర్జున్ అక్కడి ప్రజలకు అండగా నిలిచారు. తనవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి
రూ.25 లక్షలు అందించారు.


