కేరళలో వరుస అత్యాచార ఘటనలు

ఆందోళనలో అధికార పార్టీ నేతలు
తిరువనంతపురం,మే4(జ‌నంసాక్షి:  కేరళలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నవేల ఇలాంటి ఇలాంటి అత్యాచార ఘటనలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పులు తెస్తున్నాయి. తాజాగా మరో అత్యాచార ఘటనచోటుచేసుకుంది. ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. న్యాయ విద్యార్థిని పై అత్యంత పైశాచికంగా అత్యాచారం జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం సవిూపంలో 19ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు మంగళవారం యువతిపై బలాత్కారం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు.. సుజిత్‌(25), శైజు(24)గా బాధితురాలు పోలీసులకు తెలిపింది. వీరిలో శైజు అనే వ్యక్తి యువతి స్నేహితుడని, అతడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపోతే కేరళలో 30ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు పాల్పడింది ఆ ఇద్దరు వ్యక్తులేనా అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం జరుగుతున్న విచారణపై పోలీసులు ఎలాంటి వివరాలను వెల్లడించడంలేదు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి

వూమెన్‌ చాందీ స్పందించారు. ఇది దారుణమని.. నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. కాగా.. ఏప్రిల్‌ 28న జరిగిన ఈ ఘటనను రాష్ట్ర దళిత, గిరిజన కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో విచారణ చేపట్టి.. మే 28లోగా కమిషన్‌ను నివేదిక అందజేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది.

కేరళలో గత గురువారం  న్యాయ విద్యను అభ్యసించే 30 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేశారు. ఎర్నాకుళం పెరుంబవూర్‌లోని తన నివాసంలోనే ఆమె శవమై కన్పించింది. కడుపులో నుంచి అవయవాలు బయటకు వచ్చి.. రక్తపు మడుగులో పడిఉన్న కన్నకూతురిని చూడగానే మృతురాలి తల్లి నిశ్చేష్టురాలయ్యారు. దీంతో ఆమె మానసికంగా తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. ప్రస్తుతం మృతురాలి తల్లికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.