కేరళలో విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర

సుప్రీం తీర్పు అమలు చేయకుండా చేస్తోంది: ఏచూరి
తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమలలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల నిరసన, విధ్వంసాన్ని బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుటి సంఘటనలతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పోల్చారు. బాబ్రీ మసీదుని కూల్చినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తలకు కట్టుకున్నట్టే శబరిమలలో కూడా తలకు కాషాయ బ్యాండ్స్‌ కట్టుకున్నారని గుర్తుచేశారు. దీన్నిబట్టి అక్కడి నిరసన, విధ్వంసం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజ్‌ చేస్తున్నట్టు తేలిపోయిందన్నారు. శబరిమలకు వార్తల సేకరణకు వెళ్లిన టీవీ మహిళా జర్నలిస్టులపై, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. శబరిమల ఆలయ గేట్లు తెరవనీయవద్దని, అసలు ఆలయాన్నే సకాలంలో తెరవకుండా చూడాలని వాళ్లు చేసిన ప్రయత్నం ఫలించలేదని ఏచూరి వ్యాఖ్యానించారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్ట్‌ ఇచ్చిన ఆదేశాలను తాము పాటించాల్సిందేనని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియారి బాలకృష్ణన్‌ చెప్పారు. అన్ని వయసుల వారు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని గతంలో సమర్థించిన కాంగ్రెస్‌, ఇప్పుడు ఆందోళనలు చేస్తోందని విమర్శించారు. కేరళలో తాము అధికారంలో ఉండటమే దీనికి కారణమన్నారు. సుప్రీంకోర్ట్‌ ఆదేశాలను అమలు చేయడానికి తాము చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఐతే బీజేపీ వాటిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. శబరిమలలో పరిస్థితులను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఆయన దాన్ని సున్నితంగా పరిష్కరిస్తారని బాలకృష్ణన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.