కేరళ దళిత లా విద్యార్థి అత్యాచార, హత్యపై సిబిఐ విచారణ

సూత్రప్రాయంగా అంగీకరించిన రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): కేరళలో దళిత లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగనుంది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే కేరళలో ఆందోళనలు మిన్నంటాయి. ఎన్నికల వేళ దీనిని ప్రచారాస్త్రంగా చేసుకుని విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లోనే ఉన్న దళిత యువతిపై కొందరు దుండగులు పాశవికంగా అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరిచి అనంతరం హత్య చేశారు. ఈ ఘటన ఏప్రిల్‌ 28న చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యువతి మృతిచెందిన ఆరురోజుల తర్వాత పోలీసులు విచారణ నిమిత్తం బాధితుల ఇంటికి వెళ్లారు. పౌర సమాజం నుంచి నిరసనలు తీవ్రంకావడంతో సత్వర దర్యాప్తునకు ఆ రాష్ట్ర సీఎం ఉమెన్‌ఛాందీ పోలీసులను ఆదేశించారు. కాగా విద్యార్థిని మృతిపై కేరళ అట్టుడుకిపోతోంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు. దీనిపై ప్రధాని మోడీ కూడా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ర్యాలీలు, ఆందోళనలు మిన్నంటాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాజ్‌నాథ్‌ సిబిఐకి అప్పగించాలని నిర్ణయించారు.