కేరళ పడవ పోటీలను ప్రారంభించిన మల్లు
ఇది తనకు వచ్చిన అదృష్టమని చెప్పిన అల్లు
కొచ్చి,నవంబర్10(జనంసాక్షి): వరదలతో ధ్వంసమైన కేరళలో పడవల పండుగతో కొత్త శోభ వచ్చింది. అలెప్పీలో స్నేక్‌బోట్ పోటీలను బన్నీ లాంఛనంగా ప్రారంభించారు. సిఎం విజయన్ ఆహ్వానం మేరకు ఇకరర్కడికి వచ్చిన బన్నీ పోటీలను ప్రారంభించి అభిమానులను ఉత్సాహ పరిచారు. దీంతో కేరళలోని అలెప్పీలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్‌రేస్ ఫెస్టివల్ ఉత్సాహంగా ప్రారంభమైంది. కేరళీయుల సంస్కృతికి అద్దం పట్టేలా జరిగే ఈ పడవల పోటీలకు తెలుగు సీని నటుడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన స్నేక్‌బోట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కేరళ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఈ అభిమానాన్ని కలకాలం గుర్తు పెట్టుకుంటానన్నారు. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కేరళ గవర్నర్ సదాశివం హాజరయ్యారు. కేరళలోని కొచ్చికి చేరుకున్న కథానాయకుడు అల్లు అర్జున్‌కు కేరళ ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం అలప్పుజ ప్రాంతంలోని పున్నమ్‌ద సరస్సులో జరగనున్న ఈ పోటీలకు అర్జున్ అతిథిగా హాజరు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం స్టైలిష్ స్టార్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి కొచ్చి చేరుకున్నారు. బన్నీని పలకరించడానికి, చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి బన్నీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘కేరళలో అల్లు అర్జున్‌కున్న క్రేజ్’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


