కేశవరెడ్డి కుచ్చుటోపీ

2

రూ.470 కోట్ల డిపాజిట్‌ గల్ల్లంతు

కర్నూలుసెప్టెంబర్‌10(జనంసాక్షి):

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి కేశవరెడ్డిని అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు వెల్లడించారు. గతకొంతకాలంగా అతను నిధులు పోగేసుకుని చెల్లింపులు చేయడం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇలా దాదాపు ఆరుడు వందల కోట్లు డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు   సమాచారం. విద్యార్థుల డిపాజిట్‌ డబ్బులు తిరిగి ఇవ్వలేదని కేశవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. టెన్త్‌ పూర్తయ్యాక డిపాజిట్‌ తిరిగిస్తానని చెప్పి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. దాదాపు 11 వేల మందికి రూ.575 కోట్ల మేర కేశవరెడ్డి బకాయి పడ్డాడు. ఏపీ, తెలంగాణ రాష్టాల్రో కేశవరెడ్డి బాధితులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేశవరెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇవే గాకుండా అనేకమంది నుంచి కూడా అప్పుల రూపంలో డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని బుధవారం  సాయంత్రం అదుపులోకి తీసకున్నామని కర్నూలు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. కేశవరెడ్డిపై సెక్షన్‌ 5, ఐపీసీ సెక్షన్లు 420, 403, 109 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 1100 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, 800 మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి కేశవరెడ్డి డిపాజిట్లు సేకరించారని ఎస్పీ వివరించారు. కేశవరెడ్డి మొత్తం రూ.470 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడించారు. స్కూల్‌ ఆస్తులు తాకట్టు పెట్టి వివిధ బ్యాంకుల్లో రూ.62 కోట్లు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేశవరెడ్డిపై పాణ్యం, నంద్యాల పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు.