కేశవ్‌ అక్రమాలపై చర్యలు తీసుకోండి!

– ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు
అమరావతి, మే3(జ‌నంసాక్షి) : టీడీపీ ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘాన్ని కలుసుకున్న వైసీపీ నేతలు.. పయ్యావుల కేశవ్‌ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉరవకొండలో మరణించిన రిటైర్డ్‌ ఉద్యోగి ఆంజనేయులుకు ఇటీవల ఎన్నికల అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ ను పంపారు. కానీ ఆంజనేయులు 14 ఏళ్ల క్రితమే పదవీవిరమణ చేశారు. నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ను తిప్పి పంపారని చెప్పారు. అసలు చనిపోయిన ఉద్యోగికి పోస్టల్‌ బ్యాలెట్‌ పంపడం ఏంటని ప్రశ్నించారు.
ఇలాగే అనంతపురం జిల్లాలో 50 మందికి రెండు సార్లు పోస్టల్‌ బ్యాలెట్లు అందాయని ఆరోపించారు. ఈ పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ ఫిర్యాదును పరిశీలించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు తెలిపారు.