కేసీఆర్‌కు కంటి ఆపరేషన్‌ సక్సెస్‌

– 27న బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లింపు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైంది. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు సచ్‌దేవ్‌ ఆయనకు ఆపరేషన్‌ చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ విజయవంతం కావడం పట్ల ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్‌ సచ్‌దేవ్‌కు ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. దిల్లీలో కేసీఆర్‌ వెంట కవిత, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు ఉన్నారు. సీఎం కేసీఆర్‌ కంటి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయినట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కుడి కంటికి ఉదయం క్యాటరాక్ట్‌ చికిత్స జరిగిందన్నారు. ఢిల్లీలో డాక్టర్‌ సత్యదేవ్‌ నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్స చేసింది. రెండు రోజులుగా అన్ని పరీక్షలు పూర్తి చేశారు. అంతా నార్మల్‌ గానే ఉందని రిపోర్ట్‌ లు రావటంతో.. ఈ ఉదయం కుడి కన్నుకి ఆపరేషన్‌ చేశారు. మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విజయవంతం అయినట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు

27 బెజవాడ కనకదుర్గమ్మకుమొక్కులు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ విజయవాడ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌.. భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల వెంకన్నకు స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు విూసం సమర్పించిన విషయం విదితమే. కంటి ఆపరేషన్‌ పూర్తి చేసుకున్న సిఎం కెసిఆర్‌ ఒకటి రెండ్రోజుల్లో హైదరాబద్‌కు రానున్నారు.