కేసీఆర్ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి
– రైతు ఆత్మహత్యలపై బహిరంగ విచారణ జరపాలి
– జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్
హైదరాబాద్,అక్టోబర్8(జనంసాక్షి): కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని తెలంగాణ రైతు జేఏసీ ఛైర్మన్ రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ కోరారు.గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై బహిరంగ విచారణ జరపాలన్నారు. రైతులను రుణ విముక్తి చేయాలని, ప్రతి రైతుకు మళ్లీ రూ లక్ష వరకు రుణం ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి రైతు ఆత్మహత్యలను ఒప్పుకునే ధైర్యం లేదా? అని చంద్రకుమార్ ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై బహిరంగ విచారణకు సిద్ధమా? అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలను కలిస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. రైతు ఆత్మహత్యలను అపహాస్యం చేసే ప్రభుత్వాలు నిలబడవని హితవు పలికారు. ప్రభుత్వం ప్రజాసంఘాలు, మేథావుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతుల రుణాలన్నింటీ ఒకే సారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 10న తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు.