కేసీఆర్.. జగన్‌నుచూసి నేర్చుకో
– ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయి
– కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల, జులై22(జనంసాక్షి) : సీఎం కేసీఆర్ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సోమవారం జగిత్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉద్యోగులకు ఐఆర్ ఏదీ..? రైతులకు రుణమాఫీ ఏదీ..? నిరుద్యోగులకు భృతి ఏదీ..? ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయని విమర్శించారు. అసెంబ్లీకి రైతుబంధు, మున్సిపల్ ఎన్నికలకు ఆసరా పెన్షన్లు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. రెవెన్యూ ఉద్యోగులను పొగిడిన కేసీఆర్.. ఇప్పుడు తిడుతున్నాడని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అవినీతి ముద్ర వేస్తున్నారు.. ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు. పిల్లగాడు జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అద్భుత రాష్ట్రంగా చేస్తామని ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు జపం, ఆసరా పెన్షన్‌ల జపం చేస్తూ రాష్ట్రంలో రైతుల, ప్రజల ఇబ్బందులను మర్చారని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేసీఆర్ మాత్రం రైతుబంధు డబ్బులేశాం, ఇంకేం చేయాలన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు రాక విత్తు మొలక, మొలిసిన మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.