కేసీఆర్ పట్టుదలకు మారుపేరు
ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల
కరీంనగర్,మార్చి5(జనంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ సిఎం కేసీఆర్ ప్రకటనతో ప్రజల్లో మరో విప్లవం రానుందన్నారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కడ చూసినా ప్రజల్లో చర్చ వస్తోందన్నారు. గ్రామస్తుల ఐక్యతతో గ్రామాలు సమగ్రా భివృద్ధి సాధిస్తాయని, అలాగే ప్రజల సహకారంతో ఆధునిక విప్లవం సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపి సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కరీంనగర్ సభ విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే గ్రామాలకు ఎక్కువ నిధులు కేటాయించి, అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని వివరించారు. గ్రామాల్లో మిషన్ కాకతీయ పథకంలో చెరువునల పునరుద్దరించామని వివరించారు. పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నమని తెలిపారు. శ్మశానవాటిక, నూతన గ్రామపంచాయతీ భవనంతోపాటు, కమ్యూనిటీ భవనం, మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులను గ్రామాల్లో వేగంగా చేపడుతున్నామని చెప్పారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. అందుకే సిఎం కెసిఆర్ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి తీర్చే నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని, నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అతి స్వల్పకాలంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి, అన్నిరంగాల్లో తనదైన శైలిని కనబరుస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశిస్తే టిఆర్‌ఎస్ శాయశక్తులా ఆయనను మరింత ముందుకు నడిపిస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీల పాలనలో ప్రజలు ఏమాత్రం ప్రగతిని సాధించ లేదని, అట్టడుగు వర్గాల ఉన్నతి సాధించాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాల్సిందేనని తెలిపారు.