కేసీఆర్‌! ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

3

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి):

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని రాష్ట్ర పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హావిూలు నెరవేర్చడం లేదంటూ కేసీఆర్‌పై శుక్రవారం హైదరాబాద్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన కెసిఆర్‌ ప్రసంగాల వీడియోలను ప్రదర్శించారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరవాత, అసెంబ్లీలో కెసిఆర్‌ ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వినిపించారు. అయితే ఏడాదైనా ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. ఇది మాట తప్పడమేనన్నారు. లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామన్న కేసీఆర్‌… వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామన్న రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. రంజాన్‌ ముగిసేలోగా ఈ పక్రియను అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు  ఉత్తమ్కుమార్‌ రెడ్డి సూచించారు. ఇచ్చిన హావిూలను అమలు చేసేందుకు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు.