కేసీఆర్ .. మౌనం ఎందుకు!?
– సెంట్రల్ వర్సిటీ ఘటనపై స్పందింవేందుకు?
– భట్టి విక్రమార్క
హైదరాబాద్,జనవరి21(జనంసాక్షి): ఓ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇంతగా ఆందోళన జరుగుతున్న నిమ్మకునీరెత్తినట్లు ఉండడం సరికాదన్నారు. సిఎం వైఖరి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథ అద్భుతమని ఇటీవల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడంపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టులో జరుగుతున్న వేలకోట్ల రూపాయల అవినీతిని కూడా పరిశీలించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు అంచనాలను ఉన్నతమైన సాంకేతిక సంస్థలతో సవిూక్షించి, అవినీతి లేదని నిర్ధారించుకున్న తర్వాతే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా రోహిత్ ఘటనపై టిఆర్‌ఎస్ స్పందన అంతంత మాత్రమేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గట్టిగా పోరాడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనలో టీఆర్‌ఎస్ స్పందన అరకొరగా ఉందని, జాగృతి ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయన్నారు. కానీ సీఎం కేసీఆర్ స్పందించలేదని, మరోవైపు టిడిపి పార్టీ కూడా అరకొరగానే ఉందన్నారు. అగ్రనాయకులు స్పందించడం లేదని, కొందరు నాయకులు రోహిత్ కుటుంబాన్ని పరామర్శించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోరాటంలో దీక్షతో కూడిన పట్టుదల ప్రయత్నం అవసరమని, నిర్ధిష్టమైన ప్రణాళిక, నిర్మాణాత్మకమైన పోరాటం అవసరమన్నారు. ప్రధానంగా బీజేపీ టార్గెట్ గా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగతా రాజకీయ పార్టీల విధానాలు ఎదైనా సరే కాంగ్రెస్ తో సహా ముందుకొచ్చి కమిటీలో ఉండగలిగితే బాగుంటుందని తెలిపారు. అలాగే టిడిపితో పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందన్నారు. అంతేగాకుండా సామాజిక సంస్థలు, విద్యార్థుల సంఘాలు కమిటీలో మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రోహిత్ ఎస్సీ కాదు..బీసీ వడ్డెర అని జరుగుతున్న చర్చ అనవసరమైందన్నారు. తండ్రి వడ్డెర, తల్లి ఎస్సీ మాల అని తెలుస్తోందని, విడాకులు జరిగిన తరువాత తల్లి దగ్గర పిల్లలు ఉంటే తల్లి కులమే వర్తిస్తుందని సుప్రీం పేర్కొన్నట్లు తెలుస్తోందన్నారు. అసలు ఎస్సీ కాదనుకొంటే కేసు ప్రాధాన్యత పోతుందా ? అని ప్రశ్నించారు. ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పురిగొల్పే విధంగా ప్రేరేపించడం నేరమన్నారు. కులాలకు అతీతమైన తీర్పు ఇవ్వాలని, కులాన్ని బట్టి శిక్షించేది
మనుధర్మ శాస్త్రమని తమ్మినేని తెలిపారు.