కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం నుంచి పైప్‌లైన్‌

2

మెదక్‌,జనవరి12(జనంసాక్షి):ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసే పనిని అధికారులు ఇవాళ చేపట్టారు. జగదేవ్‌ పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలో ఉన్న కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం గుండా పైపులైను వేయాల్సి వచ్చింది. రైట్‌ ఆఫ్‌ వే చట్టం ప్రకారం పైపు లైను వేస్తున్నట్లు అధికారులు కేసీఆర్‌ కు సమాచారం అందించారు. దానికి కేసీఆర్‌ కూడా అంగీకరించారు. రైట్‌ ఆఫ్‌ వే చట్టం ప్రకారం ఎవరి భూమిలోనుంచైనా పైపు లైను వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. దానికి ముఖ్యమంత్రి కూడా అతీతుడు కాదని సీఎం కేసీఆర్‌ చెప్పి అధికారులకు గుర్తుచేశారు. దాదాపు 300 విూటర్ల మేర కేసీఆర్‌ భూమిలో పైపులైను వేశారు. గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొచ్చే ఈ పైపులైను శివారు వెంకటాపురం నుంచి వరదరాజుపురం వరకు వెళ్తున్నది. పైపులైను నిర్మాణం కోసం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో కొంత మేర అల్లం పంటను కూడా తొలగించాల్సి వచ్చింది. రైతులైనా, ఎవరైనా సరే తెలంగాణ ప్రజలందరికీ మంచినీరు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. మిషన్‌ భగీరథలో భాగంగా తెలంగాణలో పది నియోజకవర్గాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీ నాటికే మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి, స్టేషన్‌ ఘనపూర్‌, జనగామ, నల్గొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నియోజకవర్గాలకు తొలివిడత మంచినీరు అందించనున్నారు.