కేసీఆర్‌ పథకాలతో పాటు ట్రస్టు ద్వారా సేవలు అందిస్తా..!

– ఆరెంద బ్రిడ్జి… మర్రివాగు ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తా
– ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌
మంథని, (జనంసాక్షి) :మనస్సుండి ఆలోచించే నాయకుడు ఉంటేనే మనం బాగుపడుతామని గుర్తించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం మంథని మండలం ఖాన్‌సాయిపేట, గోపాల్‌పూర్, చిన్న ఓదాల, గద్దలపల్లి, బిట్టుపల్లి, నగరంపల్లి, అక్కేపల్లి, మల్లేపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన అభివృధ్ది సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఓట్లు వచ్చాయని ఆగమై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఒక్కసారి కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి మోసపోయి ఐదేండ్ల అభివృధ్దికి దూరమయ్యారని అన్నారు. అనేక ఏండ్లు అధికారంలో ఉన్నా ఆమడదూరంలో ఉన్న ఊర్లను బాగు చేయనిచరిత్ర కాంగ్రెస్‌దని ఆయన ఎద్దేవా చేశారు. ఖాన్‌సాయిపేట, సూరయ్యపల్లి లాంటి గ్రామాలు కల్వర్టులకు నోచుకోలేదని, అనేక ఏండ్లు వాగులు ఉప్పొంగితే రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తనకు నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఖాన్‌సాయిపేట, సూరయ్యపల్లి గ్రామాలకు కల్వర్టులు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండ చేశానని అన్నారు. అంతేకాకుండా నాలుగేండ్లు అనేక సేవలు అందించామని, అభివృద్ది సేవలు మీ కళ్ల ముందే ఉన్నాయని ఆయన అన్నారు. మీ కళ్ల ముందే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్‌గా ఎదిగిన తాను ఈనాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు. మీ ఆదరణ, ఆశీర్వాదంతో ఎదిగినా మీ మధ్యలోనే ఉంటున్నానని, నిత్యం మీ కోసమే ఆలోచన చేస్తూ మీరు బాగుండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. కుర్చీ, అధికారం కోసం కాంగ్రెస్‌ నాయకులు ఆరు అబద్దాలతో ముందుకు వస్తున్నారని, మన ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఐదేండ్లలోఏం చేశాడని ఆలోచన చేయాలన్నారు. ఆనాడు ఈనాడు మన గురించి పట్టించుకోలేదని, కేవలం పదవులు, అదికారం కోసమే ఆరాటపడుతున్నారని ఆయన విమర్శించారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ప్రభుత్వ పథకాలతో పాటు తన తల్లిపేరు స్థాపించినట్రస్టు ద్వారా అనేక సేవలు అందించామని ఆయన గుర్తు చేశారు. అన్నంపెట్టి ఆకలి తీర్చి,చదువుల చెప్పించిన తనపై అబద్దాలు చెప్పి ప్రజలకు దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా గొప్పగా ఆలోచన చేయాలని,కాంగ్రెస్‌ మాటలను నమ్మవద్దన్నారు. ఐదునెలల క్రితం కర్ణాటకలో ఇలాంటి పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని, ఐదు గంటల కరెంటుతో రైతులను ప్రజలను గోసపెడుతున్నారని ఆయన వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆరెంద మానేరుపై బ్రిడ్జి నిర్మాణం, మర్రివాగు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.రాష్ట్రంలో రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ సర్కార్‌ రాంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని,ముఖ్యంగా కేసీఆర్‌ భీమా ప్రతి కుటుంబానికి ధీమా ఇస్తుందన్నారు. అలాగే రైతుబంధు పెట్టుబడి సాయం, పించన్‌ల పెంపు, సౌభాగ్య లక్ష్మి పేరున ప్రతి గృహిణికి రూ.3వేలు, రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇలాంటి ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు తాను సొంతంగా కొన్నిసేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుపేదకు ఇంటి నిర్మాణం చేయిస్తానన్నారు. ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరీ చేసి బిల్లులు మాయం చేశారని,అలాంటి పరిస్థితులు ఉండవని, ప్రభుత్వం అందించే మూడులక్షలతో పాటు సొంతంగా కొంత సాయం చేసి దగ్గరుండి ఇంటి నిర్మాణం చేయించే బాధ్యత తనదేనని ఆయన హమీ ఇచ్చారు. మీ కోసం ఆలోచిస్తూ పనిచేసే బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని, ఐదేండ్లు సేవకుడిలా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.