కేసుల పేరుతో వేధింపులు మానకపోతే

సకలజనుల సమ్మెకు సిద్ధం
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హెచ్చరిక
హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులను దూరం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని తెలంగాణ టీఎన్జీఓ నాయకులు ఆరోపించారు. తెలంగాణ మార్చ్‌ సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరిం చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కేసులను ఎత్తేయకుంటే మళ్లీ సకల జనుల సమ్మెను ప్రారంభిస్తామని టీఎన్జీఓ నాయకులు హెచ్చరిం చారు. కేంద్ర హోం మంత్రి మార్చ్‌ ప్రశాంతంగా జరిగిందని చెబుతున్నా, రాష్ట్ర హోం మంత్రి తెలంగాణవాదులు విధ్వంసం సృష్టించారని అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆఖరికి డీజీపీ కూడా కేసులు లేవన్నా, హోం మంత్రి ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు. టీఎన్జీఓలపై కేసులు పెట్టడం సరికాదని, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని టీఎన్జీఓల నాయకులు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రవీందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కొన్ని సీమాంధ్ర ఛానళ్లు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేలా వార్తలు ప్రసారం చేశాయన్నారు. జేఏసీ చైర్మన్‌ కోదండరాంను తప్పిస్తున్నట్లు, కేసీఆర్‌పై తిరగబడుతున్నట్లు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారని అబద్ధాలను బ్రైకింగ్‌ న్యూస్‌గా ప్రసారం చేశారని మండిపడ్డారు. సీమాంధ్ర మీడియా ఇలాంటి రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఈ అసత్య వార్తలను నమ్మవద్దని, తెలంగాణ ఉద్యమ నాయకులంతా కలికట్టుగానే ఉన్నారని, అందరూ కలిసే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తారని వారు స్పష్టం చేశారు.