కైండ్‌నెస్‌ వాలెంటీర్లకు ఆహ్వానం

కడ్బందీగా వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ నిర్వహణ

హైదరాబాద్‌,ఆగస్టు28 : గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ ను మరింత జవాబుదారీగా నిర్వహించేందుకుగాను కైండ్‌నెస్‌ వాలెంటీర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తమ వద్ద ఉన్న తమకు అవసరంలేని పుస్తకాలు, బట్టలు, ఇతర వస్తువులను వదిలివేయడానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. దాదాపు 50కిపైగా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. అనేక కాలనీలు, ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ను పుస్తకాలు, వస్తువులను రిజిస్టర్ర్‌ ద్వారా నమోదుచేసి అవసరం ఉన్నవారికి ఉచితంగా అందజేసి వారి వివరాలను నమోదు చేయడానికిగాను రిటైర్డ్‌ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్‌లు స్వచ్ఛంద సంస్థల వారి సేవలను ఉపయోగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి నిర్ణయించారు. వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ నిర్వహణకుగాను స్వచ్ఛందంగా సేవలందించే సీనియర్‌ సిటిజన్లు, రిటైర్డ్‌ ఉద్యోగులు తమ పరిధిలోని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ల వద్ద షెల్టర్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. విూ ఇంట్లో పాత పుస్తకాలు ఉన్నాయా…? అయితే వాటిని వృధాగా ఉంచకుండా జీహెచ్‌ఎంసీ నిర్థారించిన ప్రదేశాల్లో ఉంచండి. ఈ పుస్తకాలు కొనుగోలు శక్తిలేని ఎంతో మంది చిన్నారులకు బంగారంలా ఉపయోగపడతాయి అనే నినాదంతో జె.ఎన్‌.టి.యు మాసబ్‌ట్యాంక్‌ బస్టాప్‌ వద్ద జీహెచ్‌ఎంసీ ఇటీవల ఏర్పాటు చేసిన వాల్‌ అఫ్‌ కైండ్‌నెస్‌కు విశేష స్పందన లభించింది. అయితే తాము అందిస్తున్న పుస్తకాలు, బట్టలు, ఇతర వస్తువులు కచ్చితంగా అవసరం ఉన్నవారికే వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు సూచించడంతో కైండ్‌నెస్‌ వాలెంటీర్లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయించారు. కేవలం సేవా దృక్పథంతోనే కైండ్‌నెస్‌ కేంద్రాల నిర్వహణను చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీతో కలిసిరావాలని కమిషనర్‌ కోరారు.