ఆర్టీసీ బస్సు బోల్తా పడి 43 మంది మృతికొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 43 మంది మృతిచెందినట్లు సమాచారం. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వీరిని కరీంనగర్, హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలియగానే జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌రోడ్డుపైకి ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 70 మందితో శనివారంపేట నుంచి బస్సు బయల్దేరినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. కొండగట్టు మీదుగా జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డు చివరి మూలమలుపు స్పీడ్‌బ్రేకర్ వద్ద బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా లోయలో పడింది.