కొండపాక వద్ద కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్
మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు
నేడు ప్రారంభోత్సవం..ముఖ్య అతిథులుగా రానున్న మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రమణాచారి
సిద్దిపేట,మే31(జనం సాక్షి): సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామంలో సాయి సేవా సంఘ్, ప్రశాంతి బాల మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన శ్రీ సత్యసాయి ప్రశాంత నికేతనం కాలేజీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫర్ వుమెన్‌ను జూన్ 1న ప్రారంభించనున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఈ ట్రస్ట్ ద్వారా 30 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ ట్రస్ట్ ద్వారా బాలికలకు ఉచిత విద్యనందించేందుకు కళాశాలను ఏర్పాటు చేయబోతున్నారు. పిల్లలకు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలని, మొదటి సారి తెలంగాణలో ఈ కళాశాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జూన్ 1న ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ. రమణాచారి హాజరుకాబోతున్నారు. ఆడపిల్లలకు ఉచిత విద్యనందించడం మంచి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ.రమణాచారి ఈ సందర్బంగా అన్నారు. ఆడపిల్లల కోసం ఇలాంటి సంస్థ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ విద్యా సంస్థల్లో స్టెమ్ సబ్జెక్టులను ప్రామాణికంగా తీసుకుంటున్నారని ట్రస్ట్ సభ్యులు కరుణాగోపాల్ అన్నారు. తమ కళాశాలలో వాటితో పాటు ఆర్ట్స్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక విద్యాసంస్థలు అవసరమని, ప్రస్తుతం తమ కళాశాలలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అందులో 90మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. అందులో 25 మంది అనాథలు, 20 మంది బీడీ కార్మికుల పిల్లలు, రైతులు, ఆర్థికంగా వెనుకబడిన వారు, చేనేత కార్మికుల కుటుంబాల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కళాశాల ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుందని, 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 45 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో రూ.15కోట్లతో నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులకు సంప్రదాయ విద్యతో పాటు యోగా మెడిటేషన్, డ్యాన్స్, వేద పఠనం, సంస్కృతం, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పుతామన్నారు. దేశంలోనే ఆదర్శంగా తమ కళాశాలలు నిలుస్తున్నాయన్నారు.