కొత్తసాగుచట్టాలపై సుప్రీం స్టే..
– సుప్రీం కమిటీతో మేం చర్చించం
– ఆ కమిటీ సభ్యులంతా రైతు వ్యతిరేకులే..
– దృష్టి మరల్చేందుకు కుట్ర
– ఆందోళన కొనసాగిస్తాం
– రైతు సంఘాలు
దిల్లీ,జనవరి 12(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
కమిటీ సభ్యులు వీరే..
హర్‌సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్, భూపేంద్ర సింగ్ మాన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని కోర్టు పేర్కొంది. అశోక్ గులాటి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌కు గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రమోద్ జోషి జాతీయ వ్యవసాయ అకాడవిూ సంచాలకులుగా పనిచేశారు. అయితే, ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని అభిప్రాయపడింది. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. రైతుల సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకోసమే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది.
పరిష్కారం కావాలంటే కమిటీ ముందుకు రావాలి..
సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరఫున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే, రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరఫున న్యాయవాది ఎం.ఎల్.శర్మ ధర్మాసనానికి తెలియజేశారు. అన్నదాతలు చట్టాల రద్దుకే పట్టుబడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గరకు వెళ్లగలిగినప్పుడు కమిటీ ముందుకు రావడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎటువంటి పరిష్కారం లేకుండా ఆందోళన చేయవలసి వస్తే.. అది నిరవధికంగా కొనసాగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. ”రేపు చనిపోవడానికి బదులు నేడే మరణించడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ప్రకటించారు” అని న్యాయవాది శర్మ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని జీవన్మరణ సమస్యగా పరిగణించడం లేదని తెలిపింది. చట్టం చెల్లుబాటు పైనే విచారణ జరుగుతుందని తెలిపింది. మిగిలిన సమస్యల్ని కమిటీ ముందు లేవనెత్తాలని కోరింది.
నిషేధిత సంస్థల ఉనికి మాటేమిటి?
అలాగే రైతుల నిరసనలపై కేంద్రం చేసిన ఆరోపణల్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. అన్నదాత ఉద్యమం వెనుక అసాంఘిక శక్తులు, నిషేధిత సంస్థల ఉనికి ఉందన్న ఆరోపణలపై ఏం చెబుతారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ ఆరోపణలను ధ్రువీకరిస్తారా..లేదా నిరాకరిస్తారా అని నిలదీసింది. దీనిపై పూర్తి సమాచారంతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.
ట్రాక్టర్ ర్యాలీపై రైతు సంఘాలకు నోటీసులు..
జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై సుప్రీంకోర్టు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని రాజ్‌పథ్‌లో ట్రాక్టర్ల కవాతును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దిల్లీ పోలీసు విభాగం ద్వారా ఈ వ్యాజ్యం దాఖలు చేయించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నేడు కోర్టు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ సోమవారం చేపడతామని తెలిపింది.
రైతుల ఆందోళనపై వ్యవహరిస్తున్న విధానం సవ్యంగా లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు నిలదీసిన విషయం తెలిసిందే. పరిస్థితులు విషమిస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చర్చల వ్యవహారం తెమలకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. చలి దృష్ట్యా వృద్ధులు, మహిళలు, పిల్లలు అంతా ఇళ్లకు వెళ్లాలని జస్టిస్ బోబ్డే సోమవారం వారికి విజ్ఞప్తి చేశారు
‘ఆ నలుగురూ సాగు చట్టాల్ని సమర్థించినవారే..’
‘సుప్రీం’ కమిటీని తిరస్కరించిన రైతు సంఘాల నేతలు
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చట్టాల నిలుపుదలను స్వాగతించిన రైతు సంఘాల నేతలు కమిటీని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రైతు సంఘాల నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని విశ్వసించబోమని, ఆ కమిటీ ముందు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కమిటీలో సభ్యులు ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగుచట్టాలకు అనుకూలంగా వ్యాసాలు కూడా రాశారని ఆరోపించారు. చట్టాలపై స్టే వచ్చినప్పటికీ తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందన్నారు. కొత్త సాగు చట్టాల అమలుపై స్టే విధించడం మంచి విషయమేనన్నారు. ఈ చట్టాలను రద్దుచేసే దాకా దేనికీ తాము అంగీకరించబోమన్నారు. ఈ నెల 26న తలపెట్టిన నిరసన కార్యక్రమం ప్రణాళికపై ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి శాంతియుతంగానే నిర్వహిస్తామన్నారు. ఎర్రకోట, పార్లమెంట్ వద్దకు రైతులు వెళ్తారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రైతులు తెలిపారు. 26న గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టబోయే మార్చ్ ఎలా ఉండాలో జనవరి 15న నిర్ణయిస్తామని తెలిపారు. హింసను తామెప్పుడూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.