కొత్త చట్టాలు రద్దు చేయండి
– కేరళ అసెంబ్లీ తీర్మాణం
– మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాజపా ఎమ్మెల్యే
కొచ్చి,డిసెంబరు 31(జనంసాక్షి):సెప్టెంబర్‌లో పార్లమెంట్ అత్యవసరంగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేరళ శాసనసభ ఈ రోజు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు ఆ రాష్ట్ర శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశమైంది. ‘వ్యవసాయ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం సేకరించి, అవసరమైన వారికి న్యాయమైన ధరలకు అందించాలి. దానికి బదులు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని కార్పొరేట్లకు స్వాధీనం చేసేలా ఈ చట్టాలు అనుమతిస్తున్నాయి. న్యాయపరమైన బాధ్యతను కేంద్రం విస్మరిస్తోంది. రైతుల ఈ నిరసన ఇలాగే కొనసాగితే.. కేరళపై తీవ్ర ప్రభావం పడనుంది. కేరళ వంటి వినియోగదారు రాష్ట్రానికి వ్యవసాయ ఉత్పత్తులు రావడం ఆగిపోతే, ప్రజలు ఆకలితో ఇబ్బంది పడతారు’ అంటూ తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు.
కేరళలో భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!
కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో కేరళకు చెందిన భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను ఉపసంహరించాలంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో తీర్మానం పెట్టగా.. భాజపా ఎమ్మెల్యే రాజగోపాల్ దానికి మద్దతు పలికారు. దీంతో ఆ తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ శ్రీరామకృష్ణన్ ప్రకటించారు. అయితే భాజపా ఎమ్మెల్యే ఈ తీర్మానానికి మద్దతు పలకడంతో కేరళ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తీర్మానంపై చర్చ సమయంలో రాజగోపాల్ స్పందిస్తూ.. ‘ఈ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసం తెచ్చినవి. రైతులు మధ్యవర్తులతో సంబంధం లేకుండా పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టాలు రైతులకు తమ పంట ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునేందుకు సహకరిస్తాయి. ఈ చట్టాలను వ్యతిరేకించడం అంటే రైతుల ప్రయోజనాలకు అడ్డుపడటమే’ అని పేర్కొన్నారు. ఈవిధంగా మాట్లాడుతూనే… చివరకు ఓటింగ్ సమయంలో తీర్మానానికి మద్దతు పలికారు. ఈ క్రమంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తీసుకున్నారా అని విూడియా ఎమ్మెల్యేను ప్రశ్నించగా..’ప్రజాస్వామ్యంలో అందరం ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలి. మొండిగా వ్యవహరించకుండా కొన్ని సందర్భాల్లో రాజీపడటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. నేను అందరి ఏకాభిప్రాయంతో వెళ్లే ముందు నా అభిప్రాయాలను ప్రజల ముందు వెల్లడించాను. ఏదేమైనప్పటికీ ఈ తీర్మానాన్ని నేను సమర్థిస్తున్నాను’ అని రాజగోపాల్ తెలిపారు. ఇది పార్టీ అధికారిక అభిప్రాయమా అని ప్రశ్నించగా.. పార్టీ నిర్ణయం కాదంటూ బదులిచ్చారు.