కొత్త చట్టాల రద్దే..
– ప్రత్యామ్నాయం లేదు
– స్పష్టం చేసిన రైతు సంఘాలు
– 36వ రోజుకు చేరుకున్న కర్షకుల ఆందోళన
దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాల రద్దే తమ ప్రధాన డిమాండ్ అని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన గురువారంతో 36వ రోజుకు చేరుకుంది. దేశ రాజధాని శివార్లలోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద అన్నదాతలు బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు. బుధవారం కేంద్రం, రైతు సంఘాల మధ్య ఆరోవిడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదుగంటల పాటు జరిగిన చర్చల్లో కొద్దిపాటి పురోగతి కనిపించింది. చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో జనవరి 4న మరోసారి రైతు సోదరులతో సమావేశం కానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.