కొత్త జిల్లాలపై తుది కసరత్తు

c

– 22న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌

– నెల రోజులపాటు ప్రజాభిప్రాయసేకరణ

– పరిపాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాలు

– జోనల్‌ వ్యస్థ రద్దు…మార్పులు చేర్పులు ఉంటాయని సూచన

– 23న మహారాష్ట్రతో జల ఒప్పందం

– అఖిలపక్షంలో చర్చించిన సిఎం కెసిఆర్‌

– కేబినేట్‌ అనంతరం విూడియాకు వివరాలు వెల్లడి

హైదరాబాద్‌,ఆగస్టు 20(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఆ తరవాత కేబినేట్‌లోనూ చర్చింంది. దీంతో  నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కొత్త జిల్లాల కూర్పు అంశంపై అఖిలపక్ష భేటీ, తదుపరి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. చట్టప్రకారం ముసాయిదా నోటిఫికేసన్‌ విడుదల చేస్తున్నామని, ఇప్పుడిది పబ్లిక్‌ డాక్యుమెంట్‌ అని అన్నారు. దీనిపై ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పులు చేర్పులకు కూడా ముందుకు పోతామని అన్నారు. అఖిలపక్ష భేటీలో జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతించాయన్నారు. అఖిలపక్ష పార్టీ సమావేశంలో పార్టీలు కొన్ని సూచనలు ఇచ్చాయని తెలిపారు. ఈ అంశంపై ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరిస్తామని సీఎం అన్నారు. అభ్యంతరాలను కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏ కార్యాలయాల్లో తెలపవచ్చని సీఎం చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామని, జిల్లాల, మండలాలకు సంబంధించిన సమగ్ర వివరాలను నోటిఫికేషన్‌లో తెలుపుతామన్నారు. తుది నోటిఫికేషన్‌ ఇచ్చేలోగా మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామన్నారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై ప్రజల అభిప్రాయం తెలపడానికి నెలపాటు సమయం

ఉంటుందన్నారు. అయితే కొనన ప్రాంతాలపై తమకు మక్కువ ఉన్నా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అలాంటి వారు పెద్దమనసుతో మన్నించాలన్నారు. ఆయా ప్రాంతాలను ఇతరత్రా అభివృద్ది చేస్తామని సిఎం అన్నారు. తెలంగాన ఉద్యమ సమయంలో తాము కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించామని, ప్రజలు తమకు ఆమోదం ఇచ్చారని కెసిఆర్‌ అన్నారు. ఆ మేరకు ముందుకు పోతున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గాల సమస్య రాదన్నారు. అర్బన్‌ జిల్లాల ఏర్పాటు వల్ల కూడా సమస్యుండదని, వరంగల్లో అర్బన్‌ జిల్లా ప్రతిపాదన ఉందన్నారు. ఒకవేళ ప్రజలు వద్దనుకుంటే దాని జోలికి పోమన్నారు. ఇకపోతే జోనల్‌ వ్యవస్థ ఉండదన్నారు. అది ఉమ్మడి రాష్ట్ర వ్యవహారం కనుక తాము దానిని కొనసాగించబోమని, దీనికి ఉద్యోగ సంఘాలు కూడా ముందుకు వచ్చి ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. అలాగే 23న మహారాష్ట్రతో అంతర్‌ రాష్ట్ర జల ఒప్పంద చేసుకుంటామని అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో నీటి పంచాయితీలు ఉండరాదన్నదే తమ అభిమతమన్నారు. కాంగ్రెస్‌ ప్రజెంటేషన్‌ను ఆయన తప్పు పట్టారు. నయీం కేసులో బాధితులకు వందశాతం న్యాయం చేస్తామని అన్నారు. ఇకపోతే శాంతిభద్రతల విసయంలో తెలంగాణ సర్కార్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగానే ఉంటుందన్నారు. నయీంను పెంచి పోషించిన వారే వివిధ రకాల విచారణలకు డిమాండ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు

సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీ జరిగింది. సమావేశానికి ఏడు పార్టీలకు చెందిన 14 మంది అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. భేటీలో సబ్‌ కమిటీ నివేదికలో పొందుపరిచిన ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై సమావేశంలో నేతలు చర్చించారు. కాగా సమావేశం అనంతరం సబ్‌ కమిటీ నివేదికపై మరో రెండు మార్లు అఖిలపక్షంతో సమావేశమై చర్చిస్తామని సీఎం పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానంతరం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లాల ఏర్పాటు పక్రియపై సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అఖిలపక్ష నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో జిల్లాల పునర్విభజన పక్రియను ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొనగా జిల్లాల పునర్విభజన అనివార్యమని టీడీపీ తెలిపింది. పలు రాజకీయ పార్టీలు జిల్లాల ఏర్పాటు పక్రియపై నిర్మాణాత్మక సూచనలిచ్చాయి. అఖిలపక్షం సూచనలపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. మరో రెండుమార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాల పునర్విభజన ముసాయిదాకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఈ నెల 22న ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశంపై అఖిలపక్ష భేటీ అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1974 ఏపీ కొత్తజిల్లాల చట్టం ప్రకారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే కొత్త జిల్లాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. జిల్లాల విభజనపై విధివిధానాలుండాలని కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ అన్నారు. 32 లక్షలు ఉన్న వరంగల్‌ను 4 జిల్లాలుగా విభజించి, 40 లక్షలున్న హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఉంచడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. జోనల్‌ వ్యవస్థపై నిరుద్యోగుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.  ఒక్కో నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేయొద్దని సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి కోరారు. ఏకపక్షంగా జిల్లా ఏర్పాటు ఉండదన్న మాటకు సీఎం కట్టుబడి ఉండాలని వారు సూచించారు. గిరిజన ప్రాంతాలకు ఇబ్బంది కలగవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. డీలిమిటేషన్‌ ఉంటుందని సీఎం చెప్పారని గుర్తు చేశారు. మండలాల సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉందని సీపీఐ నేతలు

అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ సిటీ వరంగల్‌ను ఒకటిగానే ఉంచాలని బీజేపీ నేతలు రామచంద్రరావు, మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలని, అవసరమైతే గుజరాత్‌ తరహాలో జిల్లాలు విభజించాని ప్రభుత్వానికి సూచించారు. సమ్మక్కసారలమ్మ, జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీల పేర్లతో జిల్లాలు ఉండాలన్నారు. జిల్లాల ఏర్పాటు సంఖ్యాశాస్త్రం కాదని టీడీపీ నేతలు రమణ, రావుల అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన చేయాలని, ప్రతిపాదనల్లో జిల్లాల మధ్య వ్యత్యాసాలున్నాయని వారు అన్నారు.