కొత్త మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల కుస్తీ
ఏర్పాట్లలో తలమునకలయిన అధికారులు
హైదరాబాద్,డిసెంబర్27(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లను చేసేందుకు మున్సిపల్ అధికారులు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే ఎన్నికల పనుల్లో ఇటు అధికారులు అటు సిబ్బంది తలమునకలయ్యారు. ప్రధానంగా కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పడ్డ పట్టణాల్లో ఓటర్ల గణన సాగుతోంది. వార్డుల విభజన కొలిక్కి వచ్చింది. రిజర్వేషన్లపై కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ పనుల్లో పురోగతి సాధిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేసేందుకు సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించిన వాటిలో వార్డులకు గాను అసెంబ్లీ ఓటరు జాబితా నుంచి వార్డుల వారీగా ఓటర్లను గుర్తించి జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ పక్రియ ఇప్పటికే 80 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. టీపోల్ వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలను నమోదు చేయడాన్ని ప్రారంభించారు. ఈ పక్రియ పూర్తి కాగానే టీ పోల్ వెబ్‌సైట్ నుంచి ఓటరు జాబితాను డౌన్‌లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.. ఈ పక్రియను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాలయంలో సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఓటరు జాబితాకు సంబంధించిన డ్రాప్ట్ పబ్లికేషన్ చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మున్సిపల్ కార్యాలయంలో ఓటరు జాబితాను నోటీస్ బోర్డులపై అతికించనున్నారు. ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవని కేవలం వార్డుల వారీగా మాత్రమే ఓటర్ల విభజన జరగుతుం దని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఓటర్ల జాబితా పక్రియ పూర్తి చేసేలా కృషి చేస్తున్నారు.