కొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్‌మార్కెట్లు 

– 100 పాయింట్లపైగా లాభపడ్డ సెన్సెక్స్‌
ముంబయి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : దేశీయ సూచీలు నేడు కొత్త రికార్డులను నమోదుచేశాయి. ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఆరంభ ట్రేడింగ్‌ నుంచే లాభాల్లో దూసుకెళ్లాయి. మధ్యలో కాస్త తడబడినా చివరకు లాభాలను దక్కించుకున్నాయి. దీంతో సూచీలు నేడు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,400 మార్క్‌కు చేరువైంది.  ఉదయం 150 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఆ తర్వాత కాస్త ఒడుదొడుకులకులోనైంది. అయితే బ్యాంకింగ్‌, చమురు కంపెనీల అండతో లాభాలను నిలబెట్టుకుంది. సోమవారం ట్రేడింగ్‌లో 109 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌.. 33,266 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ కూడా 41 పాయింట్లు లాభపడి 10,364 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.83గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో యస్‌బ్యాంక్‌, లుపిన్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటామోటార్స్‌ షేర్లు లాభపడగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఐటీసీ లిమిటెడ్‌, విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.