కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా వ్యాక్సిన్లలో మార్పులు
తయారీ సంస్థలకు సూచించిన ఎయిమ్స్ చీఫ్
న్యూఢల్లీి,డిసెంబర్20( జనం సాక్షి) : కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢల్లీి ఎయిమ్స్ ప్రధాన వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య నిపుణుల సభలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు ప్రభావం చూపకపోవడానికి గల కారణం వైరస్‌లో కొత్త మ్యూటేషన్లు జరగడమేనని అన్నారు. ఇలాంటి సమస్యను అధిగమించడానికి ప్రస్తుత వ్యాక్సిన్లలో కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చన్నారు. అలా చేసుకుంటే వైరస్‌పై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని అన్నారు. వ్యాక్సిన్లు ఒకేసారి భారీ మొత్తంలో తయారు చేయడంకన్నా ఏడాదికోసారి మార్పులు చేసి సరిపడ మొత్తంలో తయారు చేసుకుంటే మంచిదని, ధనిక దేశాలు ఇప్పటికే భారీ మొత్తంలో వ్యాక్సిన్లు తయారు చేసి ఉంటే వాటిని పేద, మధ్య తరగతి దేశాలకు పంపిణీ చేస్తే అవి వృధా కాకుండా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.