కొత్త సంవత్సరంలో స్వదేశీ టీకా – ప్రధాని ఆశాభావం
దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ వివరాలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పిన ప్రధాని.. ప్రజలకు స్వదేశీ టీకానే అందిస్తామని వెల్లడించారు.” కరోనాకు ఔషధం వచ్చేంతవరకు విశ్రాంతి తీసుకోవద్దు.. జాగ్రత్తగా ఉండాలి’ అని నేను పదేపదే చెప్పాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. 2021లో మన మంత్రం ఏంటంటే.. ‘టీకా తీసుకున్నా.. జాగ్రత్తలు పాటించాలి” అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాలు చివరి దశలో ఉన్నాయని, అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. త్వరలోనే స్వదేశీ టీకాను అందుబాటులోకి తెస్తామని, నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా భారత్..
భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా మారిందని, అన్ని దేశాల చూపు మనవైపే ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో వైద్య విద్యను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం విస్తృతంగా పనిచేస్తోందన్నారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజనతో రూ.30వేల కోట్లకు పైగా పేద ప్రజల సొమ్ము ఆదా అయిందని చెప్పారు. పేద ప్రజలకు జన ఔషధ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా ఈ కేంద్రాలు ఉండగా.. అక్కడ మందులు సాధారణం కంటే 90శాతం తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పారు.
వదంతులు నమ్మొద్దు..
మన దేశంలో వదంతులు తొందరగా వ్యాపిస్తాయని, కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పుకార్లు సృష్టిస్తారని మోదీ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా అలాంటి వదంతులే వస్తున్నాయని, అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘కొవిడ్‌పై పోరు అంటే.. కంటికి కనిపించని శత్రవుతో యుద్ధం చేస్తున్నట్లే. ఇలాంటి సమయంలో వదంతులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఒక బాధ్యతాయుత పౌరుడిగా సోషల్‌విూడియాలో వచ్చే పుకార్లకు దూరంగా ఉండాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.