కొత్త సచివాలయ నిర్మాణంపై బిజెపి రగడ
కట్టి తీరుతామని ప్రకటించిన సిఎం కెసిఆర్
సచివాలయం, అసెంబ్లీ, కళాభవన్, కార్యాలయాలన్నీ ఒకేచోట
వితండవాదం తగదన్న సిఎం కెసిఆర్
అసెంబ్లీలో స్పష్టం చేసిన సిఎం
నిరసనగా బిజెపి వాకౌట్
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని, ఇందులో వెనక్కి పోయే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. రాబోయే తరాలకు అద్భుతమైన సచివాలయం, అసెంబ్లీ, కల్చరల్ సెంటర్,ప్రభుత్వ భవనాలను నిర్మించి అందించాలన్నదే తమ ఆశయమన్నారు. ఇందులో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. తాము చేసేది తప్పా రైటా అనేది ప్రజలు తేలుస్తారని కూడా అన్నారు. ప్రశ్రోత్తరాల సమయంలో బిజెపి సభ్యులు లేవనెత్తిన ఈ అంశంపై సిఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. సెక్రటేరియట్ పై వితండవాదం వద్దని.. కచ్చితంగా నిర్మాణం చేసితీరతామని సీఎం కేసీఆర్ అన్నారు. వందేళ్ల వరకు ఉండేలా నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ నిర్మాణాలు తనకొచ్చిన ఆలోచన కాదని.. 1969కంటే ముందు నీలం సంజీవరెడ్డి కాలంలోనే తీసుకున్నారన్నారు. బ్రహ్మానందరెడ్డి సమయంలో కూడా ఈ ఆలోచన ఉందని.. అయితే అవి ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయ కట్టడాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. పార్కింగ్ , ఫైరింగ్ సదుపాయాలు లేవని అన్నారు. అందుకే కొత్త సెక్రటేరియట్, శాసనసభ నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. హైదరాబాద్ లాంటి ప్రపంచస్థాయి నగరానికి అద్భుతమైన సచివాలయం, అసెంబ్లీ, కార్యాలయాలు ఉండాల్సి ఉందన్నారు. ఈ విషయమై చర్చలో సిఎం కెసిఆర్ ధృడవైఖరిని ప్రదర్శించడంతో బిజెపి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
తరవాత వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ మదుసూధనాచారి ప్రకటించారు. అనంతరం
15 నిమిషాల పాటు టీ బ్రేక్‌కు సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సచివాలయం తరలింపు శాసన సభలో చర్చిస్తుండగా సభ వాయిదా పడింది. అంతకుముందు సచివాలయం తరలింపు సుమారు అరగంటపాటు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో కొత్త సచివాలయంనిర్మాణంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్ జంగిల్ అయిపోతుందని సభ్యులు మాట్లాడటం తగదన్నారు. మన సచివాలయం బాగోలేదని.. దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదని అన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవనాలు కట్టేశారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇంత అడ్డదిడ్డమైన సచివాలయం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారే గందరగోళంగా ఉంటుందన్నారు. ప్రధాన విభాగాలు విసిరేసినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఒక్క బిల్డింగ్ కూడా నియమనిబంధనల ప్రకారం నిర్మించలేదని తెలిపారు. నగరంలో క్రీడామైదానాలకు కొదవలేదని.. 19 పెద్ద, ఇతర మైదానాలు ఉన్నాయని తెలిపారు. బైసన్‌పోల్ మైదానం క్రీడలకు ఉద్దేశించింది కాదని.. మిలటరీ వాళ్లదని స్పష్టం చేశారు. ఇక మన శాసన సభలో పార్కింగ్ సౌకర్యాలే లేవని కేసీఆర్ అన్నారు. శాసన సభ నుంచి మండలికి వెళ్లాలంటే.. సరైన దారి లేదన్నారు. దేశంలోనే అద్భుతమైన, చారిత్రకమైన సచివాలయం, శాసనసభ, మండలి, పోలీసు హెడ్‌క్వార్టర్స్ భవనాలు మన తెలంగాణలో నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. రాష్టాన్రికి సచివాలయం గొప్ప గౌరవ సూచకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందుకే కొత్త సచివాలయాన్ని కట్టి తీరుతామని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణం గురించి చెప్పినప్పుడు ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు
తెలిపారని సీఎం గుర్తు చేశారు. భారతదేశంలో 29 రాష్టాల్రకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్టాన్రికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు.
ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్‌లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే స్థలం లేదన్నారు. సీ బ్లాక్ అయితే మరీ దారుణంగా ఉందన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సచివాలయాన్ని కట్టారని ధ్వజమెత్తారు. సాంకేతికంగా ఫైళ్లు నిల్వ చేసుకునే వీలు లేదన్నారు. దేశంలో ఏ రాష్టాన్రికి పోయినా అక్కడి సచివాలయం ఆ రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉంటుందన్నారు. మనం కూడా అలాగే నిర్మించుకోవాలని చెప్పారు. సచివాలయం, శాసనసభ, హెచ్‌వోడీల కార్యాలయాలు కట్టాలనే ప్రతిపాదన ఉందన్నారు. మనం ఉన్న అసెంబ్లీ ఎలా ఉందని సీఎం అడిగారు. శాసనసభ నుంచి శాసనమండలికి వెళ్లడానికి ఎలా వెళ్లాలి? అని ప్రశ్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పార్కింగ్ సౌకర్యాలే లేవన్నారు. ఈ కాంప్లెక్స్‌లన్నీ రూ. 500 కోట్లలోపే నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కట్టబోయే సచివాలయానికి రూ. 180 కోట్లకు మించి ఖర్చు కాదన్నారు. ఇంకా విస్తారంగా కట్టాలంటే రూ. 240 కోట్లకు మించి ఖర్చు కాదని స్పష్టం చేశారు. మొదటగా సచివాలయం, శాసనసభను నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రధాని నరేంద్రమోదీతో భూమిపూజ చేయిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు చారిత్రక కట్టడాన్ని అందించి ఇస్తామన్నారు. గతంలో కూడా నీలం సంజీవరెడ్డి, బ్రహ్మనందరెడ్డి కూడా ఇప్పుడున్న సచివాలయాన్ని మార్చాలని ప్రతిపాదించారు. కానీ అది అమలు కాలేదన్నారు. ఏదో తాను ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రతిపాదన కాదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాలంటే ఎన్ని వంపులో తిరగాలో తెలియదన్నారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్ జంగిల్ అయిపోతదని సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైల్స్ భద్రపరిచేందుకు స్థలం లేదు. కనీసం భోజనం చేసేందుకు కూడా సదుపాయాలు లేవని సీఎం తెలిపారు. రాష్ట్రం కోసం పని చేసే ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో 6 వేల మంది ఉంటారని చెప్పారు. ప్రధాన
విభాగాలు విసిరేసినట్లు ఉన్నాయన్నారు. సవిూక్షలకు పిలిస్తే ఫైల్ తేలేదు అంటున్నారు.. మళ్లీ వెళ్లాలంటే ఎలా? అని ప్రశ్నించారు. కొత్తగా నిర్మించే సచివాలయాన్ని నిర్మించాక పాతసచివాలయంతో పాటు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఎలా వాడుకోవాలో.. అలా వాడుకుంటామని సీఎం పేర్కొన్నారు.
దేశంలోని అన్ని కంటోన్మెంట్ల కంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చరిత్ర గొప్పదన్నారు.కంటోన్మెంట్ భూబదలాయింపు జరగలేదన్నారు. బొల్లారం కంటోన్మెంట్ ఇప్పటికీ మన ప్రభుత్వం పేరుపైనే ఉందని గుర్తు చేశారు. రక్షణ విభాగం విూద ఉన్న గౌరవం పట్ల భూములు కేంద్రం ఆధీనంలో ఉంచామని తెలిపారు. జింఖానా, బైసన్ పోలో కలిపి 72 ఎకరాలు ఉంటుందన్నారు. ఇది క్రీడా మైదానం కాబట్టి అభ్యంతరాలు వ్యక్తంచేయడం తగదని, హైదరాబాద్‌లో క్రీడా మైదానాలకు కొదవ లేదని సీఎం పేర్కొన్నారు. నగరంలో 19 పెద్ద, ఇతర మైదానాలు ఉన్నాయని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆడుకునే దిక్కు లేక.. వివాహా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. బైసన్ పోలో మైదానం క్రీడలకు కాదు.. మిలిటరీ వాళ్లది అని స్పష్టం చేశారు. హకీంపేటలో 200 ఎకరాల మైదానం ఉందన్నారు. అంతకు ముందు బిజెపి సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రం లేఖను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఉన్న సచివాలయంనే వాడుకోవడం మంచిదన్నారు. సీఎం వాక్చాతుర్యం ముందు ఎవరూ సాటిరారన్నారు. సెక్రటేరియట్ నిర్మాణంపై సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని.. ఖాళీ స్థలాలు కాపాడాలని ధర్మాసనం చెబుతుందన్నారు. భేషజాలకు పోకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇష్టానుసారం చేస్తామని చెబుతామంటే తామేం చేయలేమని.. ప్రజలే నిర్ణేతలన్నారు. చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు ఇన్నేళ్లలో ప్రస్తుత సచివాలయంలో ఒక్క ఫైర్ యాక్సిడెంట్ అయినా జరిగిందా అని అన్నారు. దానికి సిఎం ప్రతిస్పందిస్తూ అనేకం జరిగాయన్నారు.