కొత్త స్ట్రేయిన్‌ ఏ14

– దేశంలో మరో 14 కొత్తరకం కరోనా కేసులు

– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

దిల్లీ,డిసెంబరు 30 (జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆరు కేసుల్ని అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం తాజాగా.. మరో 14 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించింది. దీంతో దేశంలో కరోనా కొత్త రకం కేసుల సంఖ్య 20కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు మంగళవారమే సంకేతాలిచ్చాయి. అయితే, ఈ విషయాన్ని తాజాగా కేంద్రం ధ్రువీకరించింది.బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసొలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి, క్వారంటైన్‌కు పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూకే వైరస్‌ కేసులు నిర్ధారణ కావడంతో ఆయా రాష్ట్రాల వైద్యారోగ్యశాఖలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.కొత్త వైరస్‌ను నిర్ధారించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఏడు ల్యాబ్‌లు ఇప్పటికే ఫలితాల్ని వెల్లడించాయి. బెంగళూరులోని నిమ్హాన్స్‌ ప్రయోగశాలలో ఏడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒకటి, దిల్లీలోని ఎన్‌సీడీసీలో ఎనిమిది, దిల్లీలోని ఐజీఐబీలో ఒకటి, కల్యాణిలోని ఎన్‌ఐబీజీలో ఒక కేసు నిర్ధారణయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పది ప్రయోగశాలల్లో 107 నమూనాల్ని పరీక్షించారు.నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య మొత్తం 33వేల మంది బ్రిటన్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది. వీరందరినీ గుర్తించి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని వెల్లడించింది. లండన్‌లో కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన భారత్‌ అక్కడి నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అలాగే కొవిడ్‌పై ఏర్పాటైన ప్రత్యేక జాతీయ కార్యదళం డిసెంబరు 26న సమావేశం నిర్వహించి కొత్త రకంపై సవిూక్ష చేసింది. పరీక్ష, గుర్తింపు, చికిత్స వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందించింది.