కొనసాగుతున్న మున్సిపల్‌ సమ్మె

333

– కంపుకొడుతున్న నగరం

– సమ్మె విరమించలేదు

– కార్మిక సంఘాల ఐకాస

హైదరాబాద్‌ జులై10(జనంసాక్షి):

సమస్యల పరిష్కారం కోరుతూ జీహెచ్‌ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. సమ్మె కారణంగా నగరంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై చెత్త తరలించకపోవడంతో స్థానికులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె నేపథ్యంలో ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద, ఇందిరపార్కు వద్ద కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. సమ్మె విరమించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల ఐకాస స్పష్టం చేసింది. సమ్మె విరమించినట్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌కేవీ సంఘంతో తమకు సంబంధం లేదని.. అది అసలు గుర్తింపు సంఘం కానేకాదని ఐకాస నాయకులు తెలిపారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. గతంలో కార్మిక సంఘాల నాయకుడిగా వ్యవహరించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు. కార్మికులను అణగదొక్కేలా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను విరమించేంది లేదని.. రేపటి నుంచి సమ్మెను ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.