కొలువుదీరిన శాసనసభ
– ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు
– తొలుత కేసీఆర్, అనంతరం మహిళా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
– ప్రమాణస్వీకారం చేయించిన తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్
– గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి17(జనంసాక్షి) : తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. శాసనసభ తొలి సమావేశం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయింది. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ ఆహ్మద్‌ఖాన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత తాత్కాలిక స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తర్వాత సభలో మహిళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మహిళ సభ్యుల్లో రేఖానాయక్, బానోతు హరిప్రియ నాయక్, మైనంపల్లి హన్మంతరావులు ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్‌తో పాటు ¬ంమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరులకు నివాళులు అర్పించారు.. నివాళుల కార్యక్రమం ముగియగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు.
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన టీడీపీ ఎమ్మెల్యేలు..
టీడీపీ నుంచి గెలుపొందిని ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు తెదేపా భవన్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వారు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే నివాళి కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గైర్హాజర్ కావడం చర్చానీయాంశంగా మారింది. పార్టీ తరుపున కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు ఎన్నికవడం, అందులో ఒకరు గైర్హాజర్ కావడం పట్ల పలు ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీలోకి సండ్ర చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవుల కేటాయింపుకు ముందే తెరాసలో చేరుతారని ప్రచారం సాగుతుంది. దీంతో ప్రస్తుతం ఆయన తెదేపా భవన్‌కు హాజరు కాకపోవటం ఈ బలానికి ఆజ్యంపోసినట్లయింది. మరోవైపు తాను పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వల్ల హైదరాబాద్‌కు రాలేదని, అంతేతప్ప ఇందులో వేరే ఉద్దేశమేవిూ లేదని సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..
కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన 76మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు. 23మంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. సభలో అత్యంత సీనియర్ సభ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకూ ఆయన ఉప ఎన్నికతో పాటు ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాతి స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సీనియర్లుగా ఉన్నారు. ఉప ఎన్నికతో కలిపితే హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎక్కువ వయసు (73) ఉన్న సభ్యుడు కాగా, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ(33) పిన్నవయస్కురాలు. వీరిద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు
కావడం గమనార్హం. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 88 మంది తెరాస సభ్యులు, కాంగ్రెస్ పార్టీ 19, మజ్లిస్ పార్టీ 7, తెదేపా 2, భాజపా తరఫున ఒక సభ్యుడు ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో నలుగురు వేర్వేరు చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన వారు ఉన్నారు. మేడ్చల్ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో లోక్‌సభ, శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. కొడంగల్ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి కూడా మండలి సభ్యుడిగా పనిచేశారు. ఈనలుగురిని మినహాయిస్తే మిగతా 23 మంది మొట్టమొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో లేని, గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన 16 మంది ఈమారు మళ్లీ ఎన్నికయ్యారు. మొదటి శాసనసభకు నామినేట్ అయిన స్టీఫెన్‌సన్ మళ్లీ నామినేట్ అయ్యారు.