కొవిడ్ వేళ పేదలకు అండ గాంధీ ఆసుపత్రి
` 84వేల మందికి వైద్యసేవలు అందించిన ఘనత
` పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు
` అధునాతన సౌకర్యాలతో కూడిన సీిటీ`స్కాన్ ప్రారంభించిన మంత్రులు హరీశ్,
మహమూద్,తలసాని
హైదరాబాద్,డిసెంబరు 11(జనంసాక్షి): కొవిడ్ సమయంలో దాదాపు 84 వేల మందికి వైద్య సేవలు అందించిన ఘనత గాంధీ ఆస్పత్రిదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతకడం కష్టం అనే స్థితిలో ఉన్న వారికి సైతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించి ప్రాణాలు పోశారని కితాబిచ్చారు. అధునాతన సౌకర్యాలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యూనిట్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీతో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం అక్కడే విూడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 సీటీ స్కాన్ యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. గాంధీలో గత రెండేళ్లుగా క్యాథ్ ల్యాబ్ పనిచేయక పోవటంపై అధికారులతో చర్చించానని.. త్వరలోనే క్యాథ్ ల్యాబ్‌ని తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు తెలిపారని.. త్వరలో మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని మంత్రి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కేవలం 15 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు. వారిలో ఇప్పటికే 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని.. మరో ఇద్దరికి సంబంధించిన సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల 6 లక్షల మంది వ్యాక్సినేషన్ వేసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదు కాలేదన్నారు. దాదాపు 11 హైరిస్క్ దేశాల నుంచి 3,235 మంది హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి పరీక్షలు చేయగా 15 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. వీరి శాంపిళ్లను పరీక్షిస్తే 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చింది. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా టెస్టులు కూడా పెంచుతున్నాం’’ అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచుతామన్నారు. మాస్కు ఒక్కటే శ్రీరామరక్ష. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్.. ఏ వేరియంట్ అయినా మనం జాగ్రత్తగా ఉంటే మన దరి చేరదు. మాస్కు ధరించాల్సిందే. వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. బస్తీ దవాఖానాల్లో అన్ని చోట్ల కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతుందన్నారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడు కునేందుకు ప్రభుత్వానికి సహకరించాలి అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించిన హరీశ్‌రావు.. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.