కొవిన్‌ పోర్టల్‌లో ఆధార్‌ తప్పనిసరి కాదు..!


` సుప్రీంకోర్టులో కేంద్ర ఆరోగ్యశాఖ అఫిడవిట్‌
దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతోన్న భారత్‌.. ఇందుకోసం కొవిన్‌ (అనీచిఎఔ) పోర్టల్‌ను వినియోగిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం సూచించిన తొమ్మిది రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడిరచింది. ఆధార్‌ లేకుంటే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌కు కొన్ని కేంద్రాలు అనుమతించడం లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.కొవిన్‌ పోర్టల్‌లో ఆధార్‌ను తప్పనిసరి చేశారని ఆరోపిస్తూ సిద్ధార్థ్‌ శంకర్‌ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆధార్‌ కార్డుకు బదులుగా పాస్‌పోర్టు చూపినప్పటికీ తనకు వ్యాక్సిన్‌ ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. ఈ విషయంపై ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని అక్టోబర్‌ 1, 2021న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందనగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ సమర్పించింది. వ్యాక్సిన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరి కాదని.. తొమ్మిది గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించవచ్చని తెలిపింది.అంతేకాకుండా మానసిక ఆరోగ్య కేంద్రాలు, జైళ్లలో ఉన్న వారికి గుర్తింపు కార్డు లేకున్నా వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించినట్లు తెలియజేసింది. ఇలా గుర్తింపు కార్డులు లేకుండానే ఇప్పటివరకు దాదాపు 85లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదే సమయంలో ఆధార్‌ కార్డు చూపలేదనే నేపంతో ప్రైవేటు కేంద్రంలో వ్యాక్సిన్‌ ఇవ్వలేదని పిటిషనర్‌ చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.ఇదిలాఉంటే, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇందులో భాగంగా దాదాపు కోటిన్నర మందికి ప్రికాషనరీ డోసు (మూడోడోసు) అందించినట్లు తెలిపింది.