కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ట్రిప్పులు
గుంటూరు,ఫిబ్రవరి28( జనం సాక్షి): కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండతో పాటు ఇతర ఆలయాలకు సోమవారం నుంచి అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.విజయగీత తెలిపారు. భక్తులకు రద్దీకి అనుగుణంగా 740 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, కోటప్పకొండ కింద, పైనతో పాటు ఇతర శైవక్షేత్రాలలో మొత్తం ఆరు క్యాంపులను ఏర్పాటు చేసి నిరంతరం సిబ్బంది పర్యవేక్షించనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. అలానే మార్గమధ్యంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కోటప్పకొండ పైకి, కిందకి రాకపోకల కోసం చిత్తూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా సప్తగిరి మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీల కోసం ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు ఆర్‌ఎం తెలిపారు. రెండు మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో బస్సులను తిప్పుతారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట విూదుగా కోటప్పకొండకు చేరుకునే వీలుంది. గుంటూరు నుంచి నరసరావుపేట విూదుగా కోటప్పకొండకు వెళ్లవచ్చు.అటు చిలకలూరిపేట రోడ్డులో, ఇటు నరసరావుపేట వైపు కూడా ప్రత్యేకంగా బస్‌స్టేషన్ ఏర్పాటు చేసారు. వందలాది బస్సులు వెంట వెంటనే తిరుగుతుంటాయి. రాత్రి అయ్యేసరికి కొండ వద్ద జనసంద్రమై ఉంటుంది.కార్తీకమాసంలో కొండ పైకి సోమవారం, ఆదివారం రోజుల్లో బస్సులు తిరుగుతాయి. నరసరావుపేట, కోటప్పకొండ, చిలకలూరిపేటకు నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. రాయలసీమ, వినుకొండ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు నరసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం
వద్ద నుంచి కుడివైపునకు మళ్లి కొండకు చేరవచ్చు. తిరునాళ్ల రోజు ప్రభుత్వపరంగా అన్ని శాఖల స్టాళ్లు పెట్టడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. తిరునాళ్లకు వచ్చిన రైతాంగానికి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తారు. భద్రత పరంగా కోటప్పకొండకు పోలీసు అధికారుల ప్రత్యేక క్యాంప్ ఏర్పాటవుతోంది. పోలీసు అధికారుల కోసం ప్రత్యేకంగా గుడారాలు నిర్మించారు.