కోటి మొక్కలు లక్ష్యంగా ముందుకు
ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే సాధ్యం
అడవుల జిల్లా పేరును నిలపాలి: డిఎఫ్‌వో
ఆదిలాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని అటవీశాఖ అధికారులు అన్నారు. ఇప్పటికే జిల్లాలో అటవీ శాఖ అధికారులు 35లక్షల మొక్కలు నాటారని చెప్పారు. అడవులు అంతరించి పోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అటవీశాఖ జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. చేలగట్లపై మల్బరీ వేప, టేకు ఇతర మొక్కలు నాటుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అవి భావితరాలకు ఫలాలను అందిస్తాయన్నారు. పలుచ బడ్డ అడవులను దట్టమైన అడవులుగా తీర్చి దిద్దితేనే పర్యావరణాన్ని కాపాడుకొవచ్చని తెలిపారు. అడవులతోనే జీవజాతులకు మనుగడ ఉంటుందని, ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఇంటికీ మొక్క లు సరఫరా చేస్తామని, ఆరు మొక్కలు తప్పకుండా నాటాలని సూచించారు. రైతులకు వ్యవసాయ అనుబంధ మొక్క లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు జిల్లా ప్రజలందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో వంద ఇప్ప మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పపువ్వుతో గిరిజనులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యం ఇచ్చామని, లక్ష్యాన్ని మించి మొక్కలు నాటి జిల్లాను హరితహారంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడంలో
భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిచేందుకు కృషి చేయాలన్నారు. వాయు కాలుష్య నివారణకు మొక్కల పెంపకమొక్కటే మార్గమన్నారు. ప్రతీ విద్యార్థి మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.