కోటి రతనాల వీణకు కోటి ఎకరాల సాగునీరు

C

– అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

– ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం

– మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులతో ఇరు రాష్ట్రాలకు జలగండం

– శాసనసభలో సీఎం కేసీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న సాగునీటి ప్రాజెక్టులను కట్టి తీరుతాం.. కోటి ఎకరాలకు నీళ్లందిస్తాం.. రైతుల కన్నీళ్లు తుడుస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చకున్నదే సాగునీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యమన్నారు. నీటి పంపకంలో ఇన్నాళ్లు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పనపై సభ్యులకు వివరణ ఇచ్చారు. గోదావరి, కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన కోటాను సీఎం అసెంబ్లీ వేదికగా స్పష్టంగా వివరించారు. వాటర్‌ షెడ్‌కు కాకతీయులే ఆదర్శంగా నిలిచారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ద్వారా రెండు తెలుగు రాష్టాల్రకు ముప్పుందన్నారు. దాదాపు 400కు పైగా ప్రాజెక్టుఉల కట్టారని అన్నారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలన్నదే తమలక్ష్యమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగూరు ఎండిపోయి అందులో ఉన్న మొసళ్లు బయటకొస్తున్నాయని తెలిపారు. అనేక విషయాలు అవగాహన చేసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృత మైందని సీఎంఅన్నారు. తెలంగాణ నీటి కష్టాలు తీర్చమని కృష్ణమ్మ, గోదావరి తల్లిని మొక్కని సందర్బంలేదని తెలిపారు. కృష్ణమ్మ, గోదావరి తల్లి ఒడిలో తాను వేసినన్ని పైసలు  ఎవరూ వేసి ఉండరని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదులపై నుంచి వెళ్తున్నపుడు నదుల్లో కాయిన్లు వేసి తల్లీ మా నీటి కష్టాలు ఇంకెన్నాళ్లమ్మా? ఎన్నడు మా నీటి వెతలు తీర్చుతావని మొక్కుకునే వాడినని గుర్తు చేశారు. తనతోపాటు వచ్చిన ఉద్యమకారులు కూడా నదిలో పైసలు వేసి మొక్కిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య నీటి కొరతేనని కేసీఆర్‌ అన్నారు. నీటి అంశంలో గత ప్రభుత్వాలు తెలంగాణపై పూర్తి వివక్షతో వ్యవహరించాయన్నారు. 1956 నాటికే తెలంగాణలో నీటి పారుదల వ్యవస్థ సమగ్రంగా ఉందని గుర్తు చేశారు. వాటర్‌ షెడ్‌ అంటే ఏంటో కాకతీయ రెడ్డి రాజులు ప్రపంచానికి చాటి చెప్పారు అని తెలిపారు. కులీ కుతుబ్‌ రాజులు యుద్ధానికి

వెళ్లిన సందర్భంలో నౌబత్‌ పహాడ్‌ ఎక్కితే హుసేన్‌సాగర్‌ అనే సరస్సు కనిపించిందన్నారు. 1500వ సంవత్సరంలో కుతుబ్‌ షాహీలు హుస్సేన్‌ సాగర్‌ను కట్టించారని పేర్కొన్నారు. 11వ శతాబ్ధంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని తెలిపారు. ప్రపంచంలో మొట్ట మొదటి మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిజాం సాగర్‌ ప్రాజెక్టు అని చెప్పారు. అసఫ్‌ జాహీలు ఎన్నో విూడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టించారని గుర్తు చేశారు. దుమ్ముగూడెం టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒరిగేందేవిూ లేదన్నారు.

పాలమూరు ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టి తీరుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలే హైకోర్టులో పిల్‌ వేశారని గుర్తు చేశారు. హైకోర్టు దానిని కొట్టివేసి ప్రాజెక్టును కట్టేందుకు అనుమతించిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. ఆకుపచ్చ, హరిత తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇన్ని ఆటంకాలు సృష్టించినా, అవరోధాలు కల్పించినా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని గంటాపథంగా చెప్పారు. తప్పకుండా సాగునీరు తెస్తాం, తెలంగాణ రైతు కన్నీళ్లు తుడుస్తామని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చెరువులన్నీ ధ్వంసం

ఉమ్మడి రాష్ట్రంలో చెరువులన్నీ ధ్వంసమై పోయాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కోటీ 11 లక్షల కోటీ ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సరిపడనంతా నీరు పారలేదు. చాలా వరకు భూములన్నీ బీడుగానే ఉన్నాయన్నారు.  తెలంగాణ ప్రాజెక్టు అనగానే అంతర్‌ రాష్ట్ర వివాదాలు.. లేకుంటే పర్యావరణ సమస్యలు ఉండేవన్నారు. తెలంగాణ నీటి కేటాయింపులు ఫైళ్ల విూద స్పష్టంగా ఉన్నాయన్నారు. జూరాల కడితే నీళ్లు నింపుకోలేని పరిస్థితి, ఆనాడు రాజోలిబండకు బాంబులు పెట్టి నీళ్లు మళ్లించుకున్నారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్షతతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, చెరువులన్నీ అంతరించుకుపోయాన్నారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల వర్షపాతం తగ్గిందన్నారు. కాకతీయులు, రెడ్డిరాజులు తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని… వారి స్ఫూర్తిని కులీకుతుబ్‌షా కొనసాగించారని తెలిపారు. కాకతీయులు 75వేలకు పైగా చెరువులను నిర్మిస్తే… కులీకుతుబ్‌షా హుస్సేన్‌సాగర్‌ నిర్మించినట్లు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్‌ ప్రాజెక్టని వెల్లడించారు. స్వాతంత్య్రం రాక ముందు తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్‌ ధనిక జిల్లాగా ఉండేదని… సమైక్య పాలనలో ఆ జిల్లా వెనుకబడిన జిల్లాగా మారిపోయిందన్నారు.

మహారాష్ట్ర ప్రాజెక్టులతో ముప్పే

మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల్రు  నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. ఆ రెండు రాష్టాల్రు  కృష్ణా, గోదావరి నదులపై సుమారు 450 ప్రాజెక్టులు కట్టాయని… దీంతో తెలంగాణలోని సింగూరు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా రావడం లేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమ పరిధి మేరకే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. నీటి అంశంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడమే తమ ప్రయత్నం ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణ రైతన్నల కన్నీరు తుడవడమే తమ ప్రధాన లక్ష్యమని కేసీఆర్‌ ప్రకటించారు. గోదావరి, కృష్ణ, వాటి

ఉనదులపై మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ లకు ముప్పేనని కేసీఆర్‌ తెలిపారు. పెన్‌గంగపై ఆ రాష్ట్రం 31 ప్రాజెక్టులు కట్టిందని… మరో 9 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటితో 1300 టీఎంసీల నీరు తెలంగాణకు రాకుండా ఆగిపోతోందన్నారు. ప్రతి నదిపై ఇబ్బడిముబ్బడిగా బ్యారేజీలు, లిఫ్టులు కట్టేశారని.. వీటి సాయంతో నీటిని తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండిన తర్వాతే తెలంగాణకు నీళ్లొచ్చే పరిస్థితి తలెత్తిందన్నారు. మంజీరా, ఎస్సారెస్సీ, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి చుక్కనీరు రాకపోవడానికి ఇబ్బడిముబ్బడిగా కడుతున్న ప్రాజెక్టులే కారణమని స్పష్టం చేశారు. వీటన్నింటిపైనా ప్రశ్నిస్తే చివరకి మిగిలేవి వివాదాలేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు

నీళ్లు, నిధులు, నియామకాలే మా  ట్యాగ్‌ లైన్‌

పోరాటాల కారణంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌పై అని గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. ఉద్యోగాలు తప్పకుండా కేంద్ర నిబంధనలు, రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ నిరుద్యోగ యువతకే దక్కుతాయని స్పష్టం చేశారు నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, పోరాటాలు, ఆత్మత్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందన్నారు. ఇప్పటి వరకు నిధులు, నియామకాల సమస్య చాలా వరకు తీరిందన్నారు. మిగిలింది నీళ్ల పరిష్కారమేనని పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి జల విధానం ద్వారా స్వస్తి పలుకుతామన్నారు. తెలంగాణ ఏర్పడంతోనే వనరుల సమస్య చాలా వరకు తీరిందన్నారు.1969లో తెలంగాణ ఉద్యమం మూగబోయిందని, 2001లో మళ్లీ ఉద్యమం ఎగిసిపడిందన్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంపు- తెలంగాణ ప్రజలకు ఉరిశిక్షగా మారడంతో తాను ఉద్యమించానని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ అంతరాష్ట్ర వివాదాలే ఉన్నాయని అన్నారు. తెలంగాణ కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయిగోదావరి, కృష్ణా జలాలపై కేటాయింపులు ఉన్నా పొలాలు తడవలేదన్నారు. ఈ రెండు నదులు కలిపి వెయ్యి టీఎంసీలపైనే రావాల్సి ఉందన్నారు. గోదావరిలో 954 టీఎంసీల నీరు కృష్ణాలో 299 నికర, 75 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయి. మేజర్‌, మైనర్‌ ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు ఉన్నా లాభం లేకుండా పోయింది. వాటర్‌ షెడ్‌కు కాకతీయులే ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిజాంసాగర్‌ మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఆసఫ్‌జాహీలు కట్టారన్నారు. ఇన్ని అవకాశాలు, సౌకర్యాలు ఉన్నా తెలంగాణ ఎడారిగా మారిందన్నారు.

పాలమూరు కరవును పారదోలుతాం

తెలంగాణ జల విధానంతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్ఘాటించారు. జిల్లా నుంచి వలసలను నివారించడానికి ప్రాజెక్టుల నిర్మాణం ఒక్కటే పరిష్కారమని సిఎం కెసిఆర్‌ అన్నారు.  అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  పాలమూరును పచ్చగా చూసే రోజులు దగ్గర్లో ఉన్నాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని ఆ జిల్లా నేతనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదు, అయినప్పటికీ ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొదటి ప్రాజెక్టు నార్లపూర్‌ ప్రాజెక్టు అని తెలిపారు. వట్టెం, కరివెన, ఉద్ధండపూర్‌ రిజర్వాయర్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావొచ్చంది, కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతిపాదిత ఆయకట్టు కంటే నెట్టెంపాడు ద్వారా 25 వేల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. నెట్టెంపాడు ద్వారా గట్టు మండలానికి నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. భీమా ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందన్నారు. ఆర్డీఎస్‌ దిగువ భాగంలో రీడిజైన్‌ చేస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా 8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. పాలమూరు ద్వారా దక్షిణ తెలంగాణకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తామని ఉద్ఘాటించారు.  సమైక్య పాలకులు ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఎన్నటికీ కూడా పూర్తయ్యే పరిస్థితిలేదని సీఎం అన్నారు. టన్నెల్‌ సొరంగం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, మిషన్‌లు భూమిని లోపలి నుంచి తవ్వుకుంటూ సొరంగం ఏర్పాటు చేస్తాయని వివరించారు. అటు నుంచి ఒక మిషన్‌ ఇటు నుంచి ఒక మిషన్‌ సొరంగం చేసూకుంటూ పోతాయని రెండు మిషన్లు కలిశాక మిషన్లను లోపలే డెడ్‌ చేసి అలాగే వదిలేస్తారని తెలిపారు. ఇప్పుడు కూడా తాను ఇంజినీర్లను అడిగినా ఇంకా రెంండు మూడేండ్లలో పూర్తవుతుందని అంటున్నారని వివరించారు. టైగర్‌ వ్యాలీ ప్రాజెక్టు కూడా ప్రాజెక్టుకు అంతరాయంగా ఉందని తెలిపారు. ఈ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఎన్నాళ్ల నుంచో జరుగుతుందన్నారు. ఇది ఎవరి పాపమని ప్రశ్నించారు. సమైక్య పాలకులు చేసిన అన్యాయం కాదా? అని నిలదీశారు. ఇది ఎప్పటికి పూర్తయ్యేది అని అడిగారు. అయినా ప్రాజెక్టు పనులను కొనసాగిండం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. మిషన్లు భూమిలో తవ్వుకుంటూ పోతున్నాయని వివరించారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో  దిట్ట అనిపించుకున్న సిఎం కెసిఆర్‌

జలవిధానంపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో సభ్యులను ఆకట్టుకున్నారు. కంపూటర్‌ ముందు కూర్చుని మౌజ్‌ కదుపుతూ ఆయన నీటి ప్రాజెక్టులపై సమగ్ర విశ్లేషణ చేశారు. ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్ట్‌ ప్రతిపాదించారో, ఎందువల్ల దానిని రీ డిజైన్‌ చేయాలనుకుంటున్నామో అన్న విషయాలను ఓ అధ్యాపకుడిలా వివరించారు. నిష్ణాత సాంకేతిక నిపుణుడిలా ప్రాజెక్టుల వివరాలను అసెంబ్లీలో వివరించారు. నిజమైన హైటెక్‌ సీఎంగా కేసీఆర్‌ వ్యవహరించి సభ్యులను అబ్బురపరిచారు.  అసెంబ్లీలో జల విధానంపై త్రీడీ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆయన కంప్యూటర్‌ మౌస్‌ను ఎంతో చాకచక్యంగా ఆపరేట్‌ చేశారు.మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి నదులపై ఎక్కడెక్కడ, ఏఏ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టారో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పాయింట్‌ టు పాయింట్‌ నిర్దేశిస్తూ అసెంబ్లీలోని భారీ స్కీన్లప్రై ప్రదర్శించారు. ఎక్కడెక్కడ ఎంత ఎత్తున లిఫ్టులు ఏర్పాటు చేసుకున్నారో, అంగుళం అంగుళం నీటిని ఎలా వినియోగించుకుంటున్నారో వివరించారు. ఇలాంటి పరిస్థితులో మన రాష్టాన్న్రి ఎవరూ కాపాడుతారు అధ్యక్షా అంటూ ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు.  గూగుల్‌ ద్వారా తాను ఎంత కష్టపడి ఈ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వివరాలను సేకరించారో సీఎం వివరించారు. సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్‌పై చేసిన వివరణ జల వనరుల నిపుణులను కూడా ఆకర్షించింది. ప్రాజెక్టుల రీ డిజైన్‌లు ఎందుకు అవసరమో సీఎం సభ్యులకు సవివరంగా చెప్పారు. ఎలా చేస్తే తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందుతుందో ఒక సాంకేతిక నిపుణుడిగా వివరించారు. కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ టన్నెల్స్‌, ఎత్తిపోతల పథకాలు చేపట్టాయో కూలంకశంగా పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టను ల్యాప్‌ టాప్‌ లో చూపించారు. ఆ లొకేషన్‌ లో తీసుకునే చర్యలను వివరించారు. ప్రాజెక్టుల వల్ల ప్రతి ఆయకట్టుకు నీరు ఎలా అందుతుందో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా సీఎం వివరించిన తీరు టీవీ ముందు కూర్చున్న వారికి కూడా మంచి అవగాహన కల్పించేదిగా ఉంది. కాగా జలవిధానంపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో గురువారం ఇచ్చిన  పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను టిడిపి బహిష్కరించింది. దీనిని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పార్టీ ముఖ్యనేతలతో రేవంత్‌, రమణ టెలీకాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రదర్శించే జల విధానంపై ఎలా వ్యవహరించాలనే దానిపై నేతల నుంచి అభిప్రాయ సేకరించారు. అయితే అసెంబ్లీకి హాజరుకావద్దని మెజారిటీ నేతలు సూచించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలను భారీగా పెంచారు..అవినీతి ఆరోపణలు వస్తున్నాయని నేతలు చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 83 వేల కోట్లకు పెంచారని వీటికి అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్య నేతలు టీటీడీపీ నేతలకు సూచించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పై ప్రభుత్వ వైఖరి ఏకపక్షంగా ఉందని రేవంత్‌ మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సభను వాడుకుంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చుతున్నారంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. రూ.45 వేల కోట్ల పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి..తెలంగాణ నెత్తిన వేల కోట్ల అప్పులు పెడుతున్నారని రేవంత్‌, సండ్ర విూడియాకు వివరించారు. ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే దీనిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

నిబంధనలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ విరుద్దం: కాంగ్రెస్‌

అసెంబ్లీ హాలులో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడం సభా నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు  ఏ ప్రాతిపదికన అనుమతి ఇస్తున్నారని అడుగుతూ తాము స్పీకర్‌కు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్‌ మాదిరిగానే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఉండాలని తాము సూచించామన్నారు. కమిటీ హాలులో ప్రజెంటేషన్‌, అసెంబ్లీ హాలులో చర్చ జరపాలని తాము సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని షబ్బీర్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు  దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్‌ పారిపోవటం లేదని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడటానికే దూరంగా ఉన్నాం అని ఆయన స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ మొండిగా వ్యవహరించి సభలోనే ప్రజెంటేషన్‌ ఇవ్వడం, ఆయన చెప్పినట్లుగానే సభ జరగాలనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి పర్యావరణ అనుమతులు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మదిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ హయంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించే కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారే తప్ప ఇందులో కొత్తదనం ఏదీ లేదన్నారు. అలాగే రాబోయో ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదని భట్టి విమర్శించారు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావులు రహస్య ఒప్పందం చేసుకున్నారని జగిత్యాల కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సీడబ్ల్యూసీ అనుమతిలేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ఆయన ప్రశ్నిస్తూ… విద్యాసాగర్‌రావు, కేసీఆర్‌లు చేసుకున్న ఒప్పందాలను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థికభారం మోపుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కొత్తగా చేసి చూపుతున్నారని, తుమ్మడిహట్టి ఎత్తును ఎందుకు తగ్గించారో చెప్పాలన్నారు. కేసీఆర్‌ కొత్తగా ఏవిూ చేయడం లేదని, సభలో ఎక్కువ చేసి చూపుతున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌ ఎందుకు పారిపోయిందో చెప్పాలి

పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ సందర్భంగా విపక్ష సభ్యులు సభ నుంచి పారిపోయారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. ఇదెక్కడి సంప్రదాయమని ఆయన ప్రశ్నించారు. తమకు సేవ చేస్తారని ప్రజలు గెలిపించి సభకు పంపిస్తే ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. తమది జాతీయ పార్టీ అని చెప్పుకునేవాళ్లు, సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నవాళ్లు ఎందుకు సభ నుంచి వెళ్లిపోయారని, ఏ భేషజాలకోసం పోయారని, దేన్ని ఆశించి వెళ్లారని ప్రజలకు జవాబు చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేతలకు పట్టింపేలేదని సీఎం అన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ సభ నుంచి ఎందుకు పారిపోయిందని నిలదీశారు. ఒక ముఖ్యమైన ప్రజా సమస్యపై చర్చ జరుగుతుంటే కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఎందుకు లేరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సంకుచిత రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని హితవు పలికారు. ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలపై మాట్లాడాల్సిందిపోయి పైగా తమపైనే అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్య కుదర్చుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలకు శషబిషలు అవసరంలేదన్నారు.

ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది

రాష్ట్రంలో పొలిటికల్‌ కరప్షన్‌ జీరోకు తీసుకొచ్చామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తర్వాత

ఆయన సభలో మాట్లాడారు. రాజకీయ అవినీతిని జీరో శాతానికి తీసుకొచ్చామన్నారు. సెక్రటేరియట్‌లో పైరవీలకు తావులేదన్నారు. పైరవీకారులు అక్కడ కనిపించరని అన్నారు. నీటిపారుదల విషయంలో పారదర్శకంగా కార్యాచరణ అమలు చేశామని తెలిపారు. ఎన్నో సర్వేలు చేసి, అనేక కన్సల్టెన్సీలను సంప్రదించిన తర్వాత ఒక అవగాహనకు వచ్చామని తెలిపారు. నిజాంసాగర్‌, ఎస్సారెస్సీకి పూర్వ వైభవం తేవాలనేదే సర్కారు సంకల్పమని స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం ఖర్చు పారదర్శకంగా ఉంటుందని వెల్లడించారు. సీనియర్‌ జర్నలిస్టు, తలపండిన విద్యావేత్త పొత్తూరి వెంకటేశ్వర్‌రావు తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అభినందించారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.  జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తర్వాత సభ ప్రారంభం కాగానే సీఎం ప్రసంగించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న పొత్తూరి ఇవాళ తాను చేసిన ప్రసంగాన్ని టీవీలో చూసి తనను అభినందించారని వివరించారు. కానీ ఈ ప్రతిపక్షాలకు ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలేవీ పట్టవని అన్నారు.

ప్రాణహిత-చేవెల్ల అంతర్ధానం…కాళేశ్వరం ఆవిష్కారం : కెసిఆర్‌

ఇక కాళేశ్వరమే తప్ప ప్రాణహిత-చేవెల్ల అన్నది లేనేలేదని సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ప్రాణహిత కాలేశ్వరంగా మారిందని, చేవెల్ల కృష్ణా బేసినల్‌లో చేరిందన్నారు. రంగారెడ్డికి పాలమూరు ఎత్తిపోతల ద్వారానే నీరు అందిస్తామని అన్నారు. అందువల్ల ప్రాణహిత చేవెల్ల అన్నది లేదని కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మాత్రమే ఇక ముందు ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్టాన్రికి ప్రాణహిత, ఇంద్రావతి నదులు తప్ప వేరే మార్గంలేదని సీఎం  అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి దగ్గర తప్ప మరోచోట నీళ్లు లేవని వివరించారు. దక్షిణ తెలంగాణకు కూడా ఈ రెండు నదుల నీరే ఆధారమని స్పష్టం చేశారు.  ప్రాణహిత, చేవెళ్ల కెపాసిటీ 16 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు పెంచామని వెల్లడించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రతిపాదిత ఆయకట్టు 16 లక్షల 40 వేల ఎకరాలని పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు అసలు ఒప్పందమే కుదరలేదని వివరించారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.  ఆదిలాబాద్‌ జిల్లాలో 6 విూడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 2018 నాటికి జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయన్నారు. సదర్‌మాట్‌ ప్రాజెక్టు పూర్తయితే 20 వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. కడెం ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. లోయర్‌ పెన్‌ గంగా ప్రాజెక్టు పెద్ద జోక్‌.. ప్రాజెక్టులు కొత్తవి కావు.. అయినా దొంగయి కావు.. దొడ్లోకి రావు అన్నట్టే ఉంటది. లోయర్‌ పెన్‌గంగా కట్టలేని పరిస్థితి, అందుకే చనఖా కొరాట ప్రాజెక్టును కడుతున్నామని స్పష్టం చేశారు. బాసర దగ్గర ఒక చెక్‌ డ్యాం కట్టాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు వెనుక భయంకరమైన కుట్ర ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు అసలు ఒప్పందమే కుదరలేదన్నారు.

గ్యాలరీలో ఉన్న పెద్దలు క్షమించాలి: కెసిఆర్‌

తెలంగాణ జల విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ వేదికగా గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు శాసనసభ గ్యాలరీలో ఉండి వీక్షించారు. ఇందుకు మండలి సభ్యులు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు. వారు పెద్దలు కావున క్షమించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభలో కూర్చోవడం రాజ్యాంగ నియమాల ప్రకారం చెల్లదన్నారు. అందుకే గ్యాలరీలో ఉండి చూడాలని చెప్పినందుకు ఎమ్మెల్సీలు క్షమించాలన్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న తాను కూడా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించానని గుర్తు చేశారు. పెద్దలు పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. ఇకపోతే  శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. మండలిని నిరవధిక వాయిదా వేస్తోన్నట్టు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మండలి సమావేశాలు 15 రోజులపాటు కొనసాగాయి. 56 గంటల 24 నిమిషాలపాటు మండలి పనిచేసింది. కాగా, ఇవాళ మండలి సభ్యులు అసెంబ్లీలోని గ్యాలరీలో కూర్చుని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వివరించిన జల విధానంపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు.