కోడలిని హతమార్చిన మామ
సైకిల్ పై వెళ్లి పోలీసులకు లొంగిపోయిన నేరస్తుడు
తిరుపత్తూర్,డిసెంబర్3(జనంసాక్షి): తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ జిల్లాలో దారుణం జరిగింది. వేరేవారితో సంబంధం పెట్టుకుందని కోడలిని మామ హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా సైకిల్ పై వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తిరుప్పత్తూరు జిల్లా నాట్రాంపల్లి జంగలాపురంకు చెందిన కుశివన్ కశ్మీర్‌లో సైనికుడిగా సేవలు అందిస్తున్నాడు. అతనికి మురుగమ్మాల్‌తో 2009లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు 11, 8 ఏళ్ల ఇద్దరు పిల్లలున్నారు. అయితే గతంలో గజనాయకన్ పట్టిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది మురుగమ్మాల్. అయితే నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగం పొందిందని ఆమెను విధుల నుంచి తొలగించారు. అంతేకాదు విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కొద్దికాలం తర్వాత మురుగమ్మాల్ జైలు నుంచి విడుదలైంది. అయితే అదే సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా ఓ అద్దె ఇంట్లో పిల్లలతో నివాసముంటోన్న ఆమె కొందరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మామ మణి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్నినెలల క్రితం కుశివన్, మురుగమ్మాల్ విడాకులకు కూడా దరఖాస్తు చేశారు. అయితే ఈ పిటిషన్ ప్రస్తుతం విచారణంలో ఉంది. కాగా ఇల్లు విషయమై గత కొన్ని రోజులుగా మామ కోడళ్ల మధ్య వాగ్వాదం నడుస్తోంది. కాగా తాజాగా కుశీవన్ జంగలాపురం వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మురుగమ్మాల్ బుధవారం రాత్రి భర్త ఇంటికి వచ్చింది. ఇంటి విషయమై భర్త, మామలతో చర్చింది. అయితే విడాకుల కేసు విచారణలో ఉన్న సమయంలో ఎందుకు ఇంటికి వచ్చావని మణి ఆమెను నిలదీశాడు. దీంతో మామా కోడళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చుట్టుపక్కల వారు వారిని సమాధానపరిచారు. కాగా ఆరోజు రాత్రికి భర్త ఇంట్లోనే ఉండిపోయిన మురుగమ్మాల్ గురువారం ఉదయం వంటగదిలో పాలు మరగబెడుతోంది. ఈ సమయంలో మామ మరోసారి కోడలితో గొడవకు దిగాడు. మాటమాట పెరిగిపోవడంతో కత్తితో కోడలిపై దాడి చేశాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అంతకన్నా ముందే సైకిల్‌పై వెళ్లి తనే స్వయంగా నాట్రాంపల్లి పోలీసులకు లొంగిపోయాడు మణి. మురగమ్మాళ్‌కు పలువురితో అక్రమ సంబంధాలున్నాయని, అందుకే ఆమెను హత్యచేసినట్టు మణి తన పోలీసులతో చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.