కోదండరాం అరెస్టు

– అమరుల స్పూర్తి యాత్ర భగ్నం

హైదరాబాద్‌,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరో విడుత అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనడానికి జనగామ వెళుతున్న జేఏసీ చైర్మెన్‌ను.. హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కీసర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.అంతకు ముందు యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోదండరాం ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. ¬ం మంత్రిని కలిసిన అనంతరం జేఏసీ చైర్మన్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరవీరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని అన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీజేఏసీ శనివారం వరంగల్‌, జనగాం జిల్లాల్లో నిర్వహించతలపెట్టింది. ఇందుకుగాను సర్కారును అనుమతి కూడా కోరింది. అయితే యాత్రకు అనుమతి ఇచ్చే అంశంపై ఎటూ తేల్చని పోలీసులు.. ఆయా జిల్లాల్లో టీజేఏసీ నేతలను అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడిన కోదండరామ్‌ ఉదయం ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్పందన సరిగా లేదని, అయినా యాత్రను కొనసాగించి తీరుతామని కోదండరామ్‌ స్పష్టం చేశారు.

జనగామలో ఉద్రిక్తత

అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న కోదండరాం పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామునే స్థానిక జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీజేఏసీ జిల్లా చైర్మన్‌ ఆకుల సతీష్‌ తో పాటు మరో 20మందిని అదుపులోకి తీసుకొని.. బచ్చన్నపేట, జనగామ, లింగాలఘన్‌పూర్‌, రఘునాధపల్లి, స్టేషన్‌ ఘన్‌ పూర్‌ పోలీస్టేషన్లకు తరలించారు. టీ జేఏసీ నేతల ముందస్తు అరెస్ట్‌ ఫై ప్రొఫెసర్‌ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ఫూర్తి యాత్రకు నాలుగు రోజుల ముందే అనుమతి కోరినా.. అక్రమ అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకుల అరెస్ట్‌ తో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు కోదండరాం జనగామకు చేరుకుంటారని జేఏసీ నాయకులు చెబుతున్నారు.