కోలాహలంగా తెలంగాణ ఆటా సభలు

ఆడిపాడిన ఔత్సాహికులు

హూస్టన్‌,జూలై 2(జ‌నం సాక్షి ): అమెరికా తెలంగాణ సంఘం(ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు కోలాహలంగా ప్రారంభమైనట్లు సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల ఒక ప్రకటనలో తెలిపారు. 18 దేశాల నుంచి 40కి పైగా అనుబంధ సంస్థల ప్రతినిధులు, దేశ, రాష్ట్ర రాజకీయ ప్రతినిధులు, ఫ్రభుత్వ అధికారులు, వాణిజ్య వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, గాయకులు, కళాకారులు ,విూడియా ప్రతినిధులతో హూస్టన్‌ నగర వీధులు కళ కళలాడాయి. ఈ సందర్భం గా పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులను అవార్డులతో సత్కరించారు. శ్రీధర్‌ కాంచనచర్ల (కమ్యూనిటి సర్వీస్‌), డాక్టర్‌ పద్మజ రెడ్డి (జీవిత సాఫల్యం ) డాక్టర్‌ రత్నకుమారి (జీవిత సాఫల్యం), రామ చంద్రారెడ్డి (కమ్యూనిటి సర్వీస్‌) గజం అంజయ్య (చేనేత రంగం) తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. అసోసియేషన్‌ కార్యదర్శి బంగారు రెడ్డి, ఆట ఛైర్మన్‌ కరుణాకర్‌ మాధవరం, సహాయ సమన్వయ కర్త జగపతి వీరేటి తదితరులు సంస్థ చేస్తున్న పలు సేవల గురించి సభలో వివరించారు. మహాసభలకు విచ్చేసిన అతిథులకు స్థానిక బిర్యాని పాట్‌ యాజమాన్యం చక్కని రుచికరమైన హైదరాబాదీ బిర్యానీతో సహా పలు వంటకాలను సిద్ధం చేసింది. తెలంగాణ, తెలుగు కళలు, సంప్రదాయాలు ఉట్టి పడేలా మహాసభలను తీర్చిదిద్దిన ప్రతి కార్యకర్తకు, విచ్చేసిన అతిథులందరికి ఆటా ధన్యవాదాలు తెలిపింది.