కోలుకుంటున్న మార్కెట్లు
దిగివస్తున్న పసిడి ధరలు
45వేలకు చేరువలో బంగారం రేట్లు
ముంబై,నవంబర్30 (జనం సాక్షి): దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.45,010కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 తగ్గి రూ.49,100కి చేరింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి మాత్రం తగ్గలేదు. వెండి ధర నిలకడగా రూ.64,700 వద్ద స్థిరంగా ఉన్నది. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి నెలకొంది. కరోనా నేపథ్యం తర్వాత మామూలు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగి పోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయంగా బంగారం ధరలు
తగ్గడం దీనికి ఒక కారణమైతే, కోవిడ్ తర్వాత ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మరొక కారణం అని నిపుణులు చెబుతున్నారు.