కోహినూరు వజ్రాన్ని రప్పించలేం!

1

– నిస్సాహయత వ్యక్తం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకుని రావడంలో కేంద్రం చేతులెత్తేసింది. దీనిని తీసుకుని రావడం కష్టమని కూడా తేల్చేసింది.  బ్రిటిష్‌ వాళ్లు దానిని దొంగిలించలేదు, బలవంతంగా తీసుకెళ్లలేదు, దాన్ని వారికి బహుమతిగా ఇచ్చారు.. కాబట్టి వెనక్కి అడిగే ఆలోచన ఏవిూ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దానిని పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్‌సింగ్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని తెలిపింది. కాబట్టి కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి ఇవ్వమని అడిగే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. వజ్రాన్ని బ్రిటన్‌ వద్దే ఉంచుకోనివ్వమని తెలిపింది. కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి తేలేమని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావాలంటూ ఆల్‌ఇండియా హ్యూమన్‌రైట్స్‌ సోషల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. భారత్‌ను పరిపాలించే సమయంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ కోహినూర్‌ వజ్రాన్ని బలవంతంగా తీసుకెళ్లిదంటూ వస్తున్న వాదనలో పసలేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంలో అఫిడవిట్‌ను దాఖలు చేశారు. కోహినూర్‌ వజ్రాన్ని మహారాజా రంజిత్‌ సింగ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని, కోహినూర్‌ వజ్రం చోరీకి గురవ్వలేదని తెలిపింది. ఎవరూ బలవంతంగా తీసుకోలేదని అందుకే మనం కోహినూర్‌ వజ్రాన్ని క్లయిమ్‌ చేసుకోలేమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ఆరు వారాల్లో పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోహినూర్‌ వజ్రం ప్రస్తుతం లండన్‌లో ఉంది.

భారత్‌కు చెందిన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల ఈ అంశంపై కేంద్రం వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఈ విధంగా స్పందించింది. 105 క్యారెట్ల కోహినూర్‌ వజ్రాన్ని 1850లో బ్రిటన్‌ రాణికి అందజేశారు. ఆ వజ్రం ప్రస్తుతం రాణి కిరీటంలో ఉంది. గతంలో కోహినూర్‌ వెనక్కి ఇచ్చే అంశాన్ని బ్రిటన్‌ కూడా వ్యతిరేకించింది. రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని వెనక్కి ఇవ్వలేమని వెల్లడించింది. అయితే ఈ వజ్రంతో పాటు టిప్పు సుల్తాన్‌ కత్తి బ్రిటన్‌లో ఉన్న పలు విలువైన వస్తువులు వెనక్కి తీసుకురావాలని కోరుతూ ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌ నిర్వాహకులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు విచారణలో కేంద్రం తమ వైఖరిని స్పష్టంచేసింది. అయితే ఈ కేసులో మరో పార్టీగా ఉన్న విదేశాంగ శాఖ కూడా తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. ఆరు వారాల్లోగా తమ స్పందనను సమగ్రంగా తెలియజేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సాంస్కృతిక శాఖ, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, బ్రిటన్‌ల హైకమిషనర్లను కూడా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పార్టీలుగా పేర్కొన్నారు.