‘కోహ్లిని సవాల్ చేయలేరు’

'కోహ్లిని సవాల్ చేయలేరు'

పుణె: తమతో తొలి టెస్టులో ఓటమి తరువాత భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను హర్భజన్ సింగ్ తిప్పికొట్టాడు. ఒక చాంపియన్ ఆటగాడైన విరాట్ ను ఛాలెంజ్ చేయడం అంత తేలిక కాదనే విషయం తదుపరి టెస్టుల్లో మీరే చూస్తారంటూ భజ్జీ కౌంటర్ ఇచ్చాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని జయించడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య అనే విషయం ఆసీస్ గ్రహిస్తే మంచిదన్నాడు.
‘విరాట్ ఒక చాంపియన్ ప్లేయర్. అతన్ని ఒత్తిడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దాన్ని ఆ ఛాలెంజ్ ను ఒక చేత్తో విసిరేస్తాడు. మిగతా టెస్టుల్లో సరికొత్త కోహ్లిని ఆసీస్ చూడటం ఖాయం. అదే సమయంలో భారీ పరుగుల వరద సృష్టిస్తాడు. భారత క్రికెట్ జట్టుకు విరాట్ ఒక వెన్నుముక. ఏదో ఒక టెస్టులో విరాట్ ను స్వల్ప స్కోరుకు అవుటైనంత మాత్రానా అతన్ని తక్కువ అంచనా వేయకండి. అతని ఆట ఎప్పుడు చాలా ఎత్తులో ఉంటుంది’ అని హర్భజన్ సింగ్ తెలిపాడు. తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో ఆటగాడిగా, కెప్టెన్ గా కోహ్లిపై విపరీతమైన భారం పడిందనే వ్యాఖ్యలను హర్భజన్ పైవిధంగా ఖండించాడు.