‘కోహ్లి ఆటను చూడలేకపోయాం’

6న్యూఢిల్లీ:టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లిపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ టీ 20లో భారత జట్టు విజయాల్లో కీలక  పాత్ర పోషిస్తూ  విరాట్ ఆడిన తీరు అద్భుతమని కొనియాడాడు. భారత జట్టులో విరాట్ అత్యంత ప్రతిభావంతుడని సంగక్కర పేర్కొన్నాడు. అయితే వరల్డ్ టీ 20లో విరాట్ ఆట సెమీ ఫైనల్ వరకూ మాత్రమే పరిమితం కావడం నిజంగా దురదృష్టకరమన్నాడు. టీమిండియా ఫైనల్ కు చేరకపోవడంతో విరాట్ ఆటను టోర్నీ కడవరకూ ఆస్వాదించలేకపోయామని జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో సంగక్కర పేర్కొన్నాడు.

ఈ టోర్నీలో విరాట్ కోహ్లి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు నమోదు చేశాడు. వరల్డ్ ట్వంటీ 20లో విరాట్ యావరేజ్ 136.50 ఉండగా, స్ట్రైక్ రేట్ 146. 77 గా ఉంది. విరాట్ సాధించిన పరుగుల్లో 29 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. తాజాగా ఐసీసీ వరల్డ్ టీ 20 కెప్టెన్ గా  ఎంపికైన కోహ్లి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.