కోహ్లీపై నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ చేసిన ట్వీట్‌ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. గురుపూజ సందర్భంగా కోహ్లీ పలువురు క్రికెటర్లను తన గురువులుగా సంబోధించాడు. ఈ లిస్టులో భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే లేడు. దీంతో నెటిజన్లు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుంబ్లే నుంచి నువ్వు ఏవిూ నేర్చుకోలేదా కోహ్లీ?’ అంటూ పలువురు ప్రశ్నించారు.

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌కి అగ్రస్థానం ఇచ్చిన కోహ్లీ.. ధోనీ, కపిల్‌దేవ్‌, సెహ్వాగ్‌, గంగూలీ, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, రికీ పాంటింగ్‌, వివ్‌ రిచర్డ్స్‌ తదితరుల పేర్లు ఉన్న చిత్రాన్ని కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అనిల్‌ కుంబ్లే పేరు లేదు. ఇది గమనించిన నెటిజన్లు ‘కుంబ్లే పేరు మర్చిపోయావా కోహ్లీ..?’ అని కొందరు.. ‘గావస్కర్‌, కుంబ్లే పేర్లు మర్చిపోయావు’ అని ఇంకొందరు.. ‘ఓకే.. కుంబ్లే నుంచి నువ్వు ఏవిూ నేర్చుకోలేదన్నమాట’ అని మరికొందరు ట్వీట్‌ చేశారు. ‘కుంబ్లే పేరు లేదు.. ధోని పేరు ఉంది.. ఆశ్చర్యం’ అంటూ మరికొన్ని ట్వీట్లు వచ్చాయి. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో కోహ్లీ సేన వెస్టిండీస్‌, న్యూజిలాడ్‌, ఇంగ్లాడ్‌, బంగ్లాదేశ్‌, ఆస్టేల్రియాపై టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కుంబ్లే కోచ్‌ బాధ్యతలకి రాజీనామా చేశాడు. అతని స్థానంలో 2019 ప్రపంచకప్‌ వరకు రవిశాస్త్రికి కోచ్‌ బాధ్యతలు అప్పగించారు.