కోహ్లీసేనకు బీసీసీఐ జీతాలివ్వడం లేదు..

ప్రపంచంలో అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐకి పేరుంది. ఇతర క్రీడా బోర్డులకు కన్నుకుట్టేలా ఉంటుంది బీసీసీఐ సంపాదన. అలాంటి బోర్డు టీమిండియా క్రికెటర్లకు ఆర్నెళ్లుగా జీతాలివ్వడం లేదట. పురుషల టీమ్ కే కాదు… అటు మహిళా టీమ్ కు జీతాలివ్వడం లేదు. ఈ సీజన్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా సిరీస్ లను సొంతం చేసుకుంది టీమిండియా. వరుస విజయాలతో జోష్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లకు ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ పూర్తి అయిన 15 రోజుల నుంచి 2 నెలల్లోపు దానికి సంబంధించిన డబ్బులిస్తుంటుంది. వన్డేలకు  ఒక్కో మ్యాచ్ కు 15 లక్షల రూపాయలు ఇస్తుంటుంది. బెంచ్ కు పరిమితమైతే 7 లక్షల రూపాయలు ఇస్టుంటారు. మహిళా టీమ్ కు సిరీస్ పూర్తైతే లక్ష రూపాయలు ఇస్తుంటారు.

దీనికి ప్రధాన కారణం.. సుప్రీంకోర్టు ఆదేశాలే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. సుప్రీం నియ‌మించిన క‌మిటీ ప్ర‌స్తుతం బోర్డు పాలనా వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటోంది. వాళ్ల అనుమ‌తి లేనిదే ఒక్క రూపాయి కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదు. దీంతో పాటు ఐసీసీ ఇచ్చిన షాక్ కూడా ఒక కారణం. బీసీసీఐకి రావలసిన ఆదాయంపై ఐసీసీ కొత్త విధానాలు కోత పెట్టాయి. బీసీసీఐ సెక్రటరీగా అమితాబ్ చౌదరి ఉన్నారు. ఆయనే జీతాల చెక్కులపై సంతకాలు చేస్తుంటారు. ఆయన సంతకం ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. సుప్రీం నియమించిన కమిటీ ఆదేశాలు లేకుండా ఎలాంటి చెక్కు ముందుకు పోలేదు.  ప్లేయ‌ర్స్‌కు జీతాలు రాకపోవడానికి ఇవే ప్రధాన కారణాలంటున్నారు విశ్లేషకులు.