కౌంటింగ్ సిబ్బందికి పక్కాగా శిక్షణ
కౌంటింగ్ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ
పెద్దపల్లి,మే15(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్ సిబ్బందికి మొదటి దశ శిక్షణ అందించాలనీ, 21న రెండోసారి ప్రాక్టికల్ శిక్షణను జేఎన్‌టీయూహెచ్ కళాశాలలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌కు అవసరమైన సుమారు 350 మందికి పూర్తి స్థాయి శిక్షణ అందించాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి సంబంధించిన శిక్షణను మొదటి దశ లో ఏఆర్‌ఓల పరిధిలో అందించాలనీ, తదుపరి శిక్షణను పెద్దపల్లి లోక్‌సభ పరిధికి ఒకసారి నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా నిర్వహించే కౌంటింగ్ రౌండ్ల వివరాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కౌంటింగ్ హాల్‌లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించేం దుకు 144 మంది మైక్రో పరిశీలకులను నియమించాలనీ, వారికి ఈ నెల 20న మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వీవీ ప్యాట్ కౌంటింగ్ పై సైతం సిబ్బందికి శిక్షణ అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ అంశంపై సంబంధిత అధికారులతో ఇప్పటికే సవిూక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ హాల్‌లో అవసరమైన అత్యాధునిక సాంకేతిక కలిగిన కంప్యూటర్లను ఏర్పాటు చేయాలనీ, అత్యంత వేగంగా ఉండే నెట్‌వర్క్ కనెక్టివిటీ ప్రత్యేకమైన ఐపీ అడ్రస్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఏర్పాటు చేయాలని సూచించారు. కంప్యూటర్లకు నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ 8గంటలకు పైగా ఉండేలా బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాలని వివరించారు.