కౌంటీ క్రికెట్‌కు కోహ్లీ దూరం!
– వెన్ను నొప్పితో బాధపడుతున్న కోహ్లీ
– విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
న్యూఢిల్లీ, మే24(జనం సాక్షి) : భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఆశలకు గండిపడింది.. గాయం కారణంగా కౌంటీలకు కోహ్లీ దూరం కానున్నారా.. అంటే ఔననే అంటున్నాయి క్రీడావర్గాలు. ఈ ఏడాది జులైలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణించాలని భావించిన కోహ్లీ ముందుగానే అక్కడికి వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడాలనుకున్నాడు. ఈ క్రమంలో సర్రే జట్టుతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఇప్పుడు కోహ్లీ కౌంటీ క్రికెట్‌లో ఆడే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం వైద్యుల సూచన. బుధవారం మధ్యాహ్నం కోహ్లీ వెన్నెముకలో నొప్పి తీవ్రంగా వేధించడంతో ముంబయిలోని ఖర్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిశాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా డిస్క్ తప్పినట్లు తేలింది. డిస్క్ తప్పడంతో నరాలపై ఒత్తిడి పడుతోందని.. ఈ క్రమంలోనే నొప్పి బాధిస్తోందని వారు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేదని, కొద్ది రోజులు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ…’కౌంటీల కారణంగా కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో చరిత్రాత్మక టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు గాయం కారణంగా అతడు కౌంటీలకు దూరం అవుతున్నాడు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.వైద్యుల సూచన మేరకు కోహ్లీ విశ్రాంతి తీసుకోకపోతే శస్త్రచికిత్స నిర్వహించాల్సి వస్తుందట. ఇదే జరిగితే కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.